Revanth Reddy : రేవంత్ భయపడుతున్నారా? కట్టడిచేయడానికే ఆ ప్రయత్నం చేస్తున్నారా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఇటీవల చేస్తున్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి

Update: 2024-02-03 13:03 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని, ప్రజలను అప్రమత్తం చేయడానికేనా? లేక ముందస్తుగా తన ప్రభుత్వానికి ప్రమాదం ఉంటుందని గ్రహించి జాగ్రత్తగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా? అన్న చర్చ రాజకీయంగా జరుగుతుంది. బీఆర్ఎస్, బీజేపీలు కలసి తన ప్రభుత్వాన్ని కూల్చివేస్తాయన్న అభిప్రాయంతో ఉన్నట్లే కనపడుతుంది. అందుకే తరచూ ఆయన బహిరంగ సభల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి ఆరు నెలల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ నేతలే అంటున్నారని, అలాంటి వారిని గ్రామాల్లోకి రానివ్వొద్దని ఆయన ప్రజలకు చెబుతూ వస్తున్నారు. అందుకే ఆయన అలర్ట్ చేస్తున్నారని అంటున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో...
ఒక ముఖ్యమంత్రిగా ప్రభుత్వానికి ముప్పు ఉందని పరోక్షంగా చెప్పారంటే ఆయనకు ఈ తరహా ప్లాన్ జరుగుతుందని ఏమైనా ఇంటలిజెన్స్ నివేదికలు అందాయా? అన్న అనుమానం కూడా పార్టీ నేతల్లో నెలకొంది. కార్యకర్తల్లోనూ ఇదే రకమైన అనుమానాలు జరుగుతున్నాయి. వరసగా బీహార్ లో జరిగిన పరిణామాలతో పాటు ఝార్ఖండ్ లో చోటుచేసుకున్న ఘటనలను కూడా కాంగ్రెస్ నేతలు ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి వేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. సరైన సమయం వచ్చినప్పుడు అది అవకాశాన్ని చేజార్చుకోదు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలను చూశామని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
బలహీనంగానే...
అందులోనూ తెలంగాణలోనూ పెద్దగా ఏ పార్టీకి బలం లేనట్లే కనపడుతుంది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అరకొర మెజారిటీ అనే చెప్పాలి. కాంగ్రెస్ 64 స్థానాలలో విజయం సాధించింది. బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ ఎనిమిది స్థానాల్లోనూ, ఎంఐఎం ఏడు స్థానాల్లోనూ, సీపీఐ ఒక స్థానంలో విజయం సాధించాయి. 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో మ్యాజిక్ ఫిగర్ 60 మాత్రమే అంటే సీపీఐ మద్దతుతో కలుపుకుంటే కాంగ్రెస్ కు ఐదు స్థానాలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ కలసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుందన్నది కాంగ్రెస్ నేతల అనుమానం. కేసీఆర్ ఇటీవల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి అది మరింత బలపడింది. ఆయన శాసనసభకు రారని, ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారానికి ఆయన తెరదించారు.
నియోజకవర్గానికి నిధులు...
దీంతో తరచూ రేవంత్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రి ఆరు నెలలో అవుతారని బీఆర్ఎస్ నేతలు అంటుండటాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఏ ఎమ్మెల్యే వచ్చినా వారిని కలుస్తున్నారు. నియోజకవర్గాల సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలను కూడా ఓపిగ్గా వింటున్నారు. మరో వైపు నియోజకవర్గానికి పది కోట్ల రూపాయల నిధులు కేటాయించింది కూడా ఎమ్మెల్యేలలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండటానికే కారణమన్న టాక్ వినపడుతుంది. మొత్తం మీద బీఆర్ఎస్, బీజేపీ కలసి ఏదైనా కుట్రలు చేస్తాయోమోనన్న అనుమానం మాత్రం రేవంత్ రెడ్డిలో బలంగా ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా అన్ని రకాలుగా ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారని చెప్పాలి.


Tags:    

Similar News