BRS : కాంగ్రెస్ మైండ్ గేమ్... బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు ఇలా ఆట మొదలెట్టిందా?

తెలంగాణ కాంగ్రెస్ కొద్ది రోజుల నుంచి మైండ్ గేమ్ మొదలు పెట్టింది. బీఆర్ఎస్ నేతలను ఇబ్బందిపెట్టేలా వ్యాఖ్యానిస్తున్నారు;

Update: 2024-02-16 12:44 GMT

తెలంగాణ కాంగ్రెస్ నేతలు గత కొద్ది రోజుల నుంచి మైండ్ గేమ్ మొదలు పెట్టారు. బీఆర్ఎస్ నేతలను ఇబ్బందిపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. కోమటిరెడ్డి ిబ్రదర్స్ కు ఈ బాధ్యతలను కాంగ్రెస్ అప్పగించినట్లు అర్థమవుతుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ పదే పదే హరీశ్ రావును ప్రశంసించడం మైండ్ గేమ్ లో భాగమేనని అంటున్నారు. పార్లమెంటు ఎన్నికలతో పాటు ముందు ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ వేసిన ఎత్తుగడలో భాగంగానే హరీశ్ రావును ప్రశంసలతో ముంచెత్తడమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. హరీశ్ వాయిస్ ను కొంత తగ్గించగలిగితే తమకు రాజకీయంగా వెసులుబాటు దొరుకుతుందన్న కారణమూ లేకపోలేదు.

రియల్ లీడర్ అంటూ...
గత కొన్ని రోజులుగా హరీశ్ రావుపై కాంగ్రెస్ ఆట మొదలు పెట్టింది. హరీశ్ రావును రియల్ లీడర్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొగిడారు. కేసీఆర్‌కు అసలైన వారసుడు హరీశ్ రావు మాత్రమే అని ఆయన అన్నారు. కేటీఆర్ తో పార్టీ నడపటం సాధ్యం కాదన్న కోమటిరెడ్డి హరీశ్ రావుకు పార్టీ బాధ్యతలను అప్పగించాలని కోరారు. అలా కాకుంటే హరీశ్ రావు తమ పార్టీలోకి రావాలని కూడా మరొక అడుగు వేశారు. ఆయనకు మంచి అవకాశాలు కాంగ్రెస్ లో దక్కుతాయని, బీఆర్ఎస్ లో ఉంటే ఎప్పటికీ సాధ్యం కాదని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
హరీశ్ రావుకు పార్టీని....
అదే సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే స్థాయిలో హరీశ్ రావును పొగిడారు. హరీశ్ రావుకు పార్టీ పగ్గాలు అప్పగించి చూడండంటూ సవాల్ విసిరారు. అంతేకాదు.. వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ మూడు ముక్కలుగా చీలిపోతుందని, హరీశ్ రావు, కవిత, కేటీఆర్ వేర్వేరు పార్టీలు పెడతారని కూడా జోస్యం చెప్పారు. కానీ ఇదంతా పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మైండ్ గేమ్ లో భాగమేనని అంటున్నారు. హరీశ్ రావు నోటికి కొంత కళ్లెం వేయాలన్న ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే ఎక్కువ మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో వచ్చేందుకు కూడా ఈ ఆట ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
పార్లమెంటు ఎన్నికల కోసమేనా?

పార్లమెంటు ఎన్నికల కోసమే ఈ రకమైన మైండ్ గేమ్ మొదలుపెట్టిందని అర్ధం చేసుకున్న బీఆర్ఎస్ నేతలు అందుకు ప్రతిగా వారు కూడా ఆట మొదలు పెట్టారు. రేవంత్ రెడ్డి మరో ఏక్‌నాధ్ షిండే అవుతారంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డినిదించి మరొకరు ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి వేరు కుంపటి పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని చెబుతున్నారు. ఇలా బీఆర్ఎస్ పై కాంగ్రెస్, కాంగ్రెస్ ను మానసికంగా దెబ్బకొట్టేలా బీఆర్ఎస్ లు మైండ్ గేమ్ మొదలు పెట్టాయనే చెప్పాలి. 

Tags:    

Similar News