దేశంలో ఆందోళన కలిగిస్తున్న పులుల మరణాలు
ఈ ఏడాది జనవరి నుండి సెప్టెంబర్ 28 వరకు భారతదేశంలో 146 పులుల మరణాలు
ఈ ఏడాది జనవరి నుండి సెప్టెంబర్ 28 వరకు భారతదేశంలో 146 పులుల మరణాలు నమోదయ్యాయి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) ఈ డేటాను విడుదల చేసింది. పులులను రక్షించడానికి భారతదేశం ఓ వైపు ప్రయత్నాలు చేస్తూ ఉండగా.. ఈ మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ సంవత్సరం అత్యధిక సంఖ్యలో పులి మరణాలు మధ్యప్రదేశ్‌లో (34) నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 32 మరణాలు చోటు చేసుకున్నాయి.
146 పులుల మరణాలలో 24 పులి పిల్లలే ఉండడం ఆందోళన కలిగించే విషయం. ఇది పులి పునరుత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఉత్తరాఖండ్‌లో దాదాపు 17, అస్సాంలో 11, కర్ణాటకలో తొమ్మిది, రాజస్థాన్‌లో ఐదు పులులు చనిపోయాయి. దేశంలోని వివిధ టైగర్ రిజర్వ్‌లలో 70 మరణాలు నమోదయ్యాయి. భారతదేశం 2022లో 121 పులుల మరణాలను నివేదించింది. 2021లో 127; 2020లో 106; 2019లో 96; 2018లో 101; 2017లో 117; 2016లో 121; 2015లో 82; 2014లో 78; 2013లో 68, 2012లో 88 మరణాలు నమోదయ్యాయని NTCA డేటా చూపించింది. NTCA ప్రకారం, పులుల మరణాలకు కారణాలు సహజంగా లేదా అసహజంగా ఉండవచ్చు. అసహజ కారణాలలో ప్రమాదాల కారణంగా మరణాలు, ఘర్షణల్లో పులులు మరణించడం వంటివి ఉండవచ్చు. వేటాడటం అనేది ఇతర కేటగిరీలోకి వస్తుంది. ఇలా పులులు చనిపోతూ ఉండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఓ వైపు భారత్ లో పులుల సంఖ్య పెరుగుతూ ఉన్నా.. ఇలా మరణిస్తూ ఉండడం కూడా ఆందోళనకరమైన అంశమే!!