YSRCP : వేమిరెడ్డి టీడీపీలో చేరికకు ముహూర్తం సెట్ అయిందా? వైసీపీకి కొత్త అభ్యర్థి రెడీగా ఉన్నారా?
నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది
YSRCP :నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల బరిలో ఉంటారా? లేదా? అన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నెల్లూరు పట్టణ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఆయన అలకబూనారు. ఆరో జాబితా వేమిరెడ్డి అలకకు ప్రధాన కారణమయింది. ఆరో జాబితాలో నెల్లూరు టౌన్ వైసీపీ అభ్యర్థిగా జగన్ డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్‌ను ఖరారు చేయడంతో వేమిరెడ్డి కినుక వహించారు. ఆయన పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారు. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని ఆయన సూచించినా వైసీపీ అధినాయకత్వం వినకపోవడంతో ఆయన తాను పోటీ చేయనని భీష్మించుకుని కూర్చున్నారు.
ఖలీల్ ఎంపికతో...
నెల్లూరు పట్టణ నియోజకవర్గం అభ్యర్థిగా తన భార్య పేరును వేమిరెడ్డి సూచించారు. అయితే ఖలీల్ ను ఖరారు చేయడంతో ఆయనకు ఆగ్రహం వచ్చిందంటున్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని సన్నిహితులకు చెప్పినట్లు సమాచారం. కానీ జగన్ మళ్లీ మార్పులు చేర్పులు చేసేందుకు ఇష్టపడటం లేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తే ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశముంది. అందుకే ఆయనను ఏరికోరి ఎంపిక చేసినా చివరి నిమిషంలో ఆయన హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు జగన్ కొత్త అభ్యర్థిని వెదుకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకోసం పలువురి పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఆయన కాదంటే...?
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఆర్థికంగా బలమైన నేత. అంతటి బలమైన నేత వైసీపీకి అవసరం. వేమిరెడ్డి కండిషన్లకు తలొగ్గడం ఇష్టం లేని జగన్ వేరే నేత కోస అన్వేషిస్తున్నట్లు తెలిసింది. మరొకసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికోసం ప్రయత్నం చేయాలని ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేతకు అప్పగించారని తెలిసింది. ఆఖరి ప్రయత్నం చేసి ఆయన అందుబాటులోకి రాకపోతే మాత్రం ప్రత్యామ్నాయంగా మరొక నేతను ఎంపిక చేయాలన్న యోచనలో ఉన్నారు. మేకపాటి కుటుంబం నుంచి ఒకరి పేరు జగన్ ఆప్షన్ లో పెట్టుకున్నట్లు తెలిసింది. వేమిరెడ్డి తాను పోటీ చేయనని భీష్మించుకుని కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా మేకపాటి ఫ్యామిలీకి టిక్కెట్ దక్కినట్లేనని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే వేమిరెడ్డి మాత్రం ససేమిరా అంటున్నట్లు తెలిసింది.
వేమిరెడ్డి ఒప్పుకుంటే...
అయితే ఫస్ట్ ఛాన్స్ మాత్రం వేమిరెడ్డికే ఇస్తారంటున్నారు. ఆయన ఓకే అంటే సరి. లేదంటేనే మరొక పేరును చూడాలన్నది జగన్ నిర్ణయంగా కనపడుతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయిన నేపథ్యంలో నెల్లూరు వైసీపీ ఎంపీ టిక్కెట్ ఎవరిదన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే వేమిరెడ్డి అందుబాటులోకి వస్తేనే దీనిపై క్లారిటీ రానుంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు సిటీ నుంచి తప్పించినా ఆయన పట్టువీడకపోవడంతో ఆయనను మరీ అంత బతిమాలాడాల్సిన పని ఏంటన్న చర్చ కూడా మరొక వైపు సాగుతుంది. ఇలా నెల్లూరు వైసీపీ ఎంపీ సీటు విషయంలో వేమిరెడ్డి.. మేకపాటి ఫ్యామిలీల మధ్య దోబూచులాడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
టీడీపీలో చేరుతున్నట్లు....
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వేమిరెడ్డి టీడీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వేమిరెడ్డి దంపతులు చంద్రబాబును కలిసినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఆయన టీడీపీలో చేరినా మళ్లీ పార్లమెంటు సీటు మాత్రమే దొరుకుతుంది. నెల్లూరు సిటీ టిక్కెట్ ఆల్రెడీ నారాయణకు ఖరారు కావడంతో ఆయన సతీమణికి దొరికే అవకాశం లేదు. మరి టీడీపీలో చేరితే వేమిరెడ్డికి రాజకీయంగా వచ్చే లాభమేంటన్న ప్రశ్న ఎదురవతుంది. వేమిరెడ్డికి కాకున్నా టీడీపీకి మాత్రం నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి బలమైన అభ్యర్థి దొరికినట్లేనని అంటున్నారు. మరి దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. టీడీపీలో వేమిరెడ్డి చేరితే ఇక నెల్లూరు పార్లమెంటు విషయంలో చంద్రబాబు బిందాస్ గా ఉండొచ్చన్న కామెంట్స్ వినపడుతున్నాయి. దీనిపై అధికారికంగా తెలియాల్సి ఉంది. వేమిరెడ్డి మాత్రం టీడీపీలో చేరుతున్నారని, ముహూర్తం కూడా ఖరారయిందని సైకిల్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.