Ys Jagan : రెండేళ్ల ముందు నుంచే గ్రౌండ్ రెడీ చేసినట్లుందిగా
రాజకీయాలను రెండేళ్ల ముందే జగన్ పసిగట్టారు. టీడీపీ, జనసేన కలుస్తుందని అంచనా వేసి అందుకు అనుగుణంగానే అడుగులు వేశారు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను రెండేళ్ల ముందే జగన్ పసిగట్టారు. టీడీపీ, జనసేన కలుస్తుందని అంచనా వేసి అందుకు అనుగుణంగానే అడుగులు ముందుకు వేస్తూ వచ్చారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుల మధ్య పొత్తు కుదురుతుందని భావించిన జగన్ ముందు నుంచే తమ పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పవన్ ను ప్యాకేజీ స్టార్ గా చిత్రీకరిస్తూ ప్రజల్లో పలచన చేశారు. చంద్రబాబుతో పొత్తుకు వెళతారని, అయినా తాము మాత్రం ఒంటరిగానే ఎన్నికల్లోకి వెళతామని ముందు నుంచి చెబుతూ వస్తూ మైండ్ గేమ్‌కు తెరదీశారు. కిందిస్థాయి కార్యకర్తలకు ఈ పొత్తు ఆశ్చర్యపర్చవచ్చునేమో కాని నాయకులకు ముందే ఉప్పందించారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గంలో పనిచేసుకోవాలని సూచించారు.
ఇద్దరూ కలుస్తారని...
పవన్, చంద్రబాబు కలిస్తే ఎక్కడ నష్టం? ఏ సామాజికవర్గంలో ఓట్లు చీలతాయి? దాని వల్ల వైసీపీకి వచ్చే నష్టమెంత? జరిగే లాభమెంత? అన్నది నిరంతరం సర్వేలు చేయిస్తూ నివేదికలు తెప్పించుకుంటూ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆ రెండు పార్టీలు కలిస్తే ఎక్కడ బలహీనమవుతామో గుర్తించిన జగన్ ఆ ఓట్లపై కన్నేశారు. రెండు చోట్ల ఓట్లు ఉన్న వారు ఏపీలో అనేక మంది ఉన్నారు. అలాంటి వాటిని తొలగించేందుకు పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఒక్కొక్క నియోజకవర్గంలో పవన్ ప్రభావం చూపించే ఓట్లను కాని, టీడీపీ మద్దతుదారుల ఓటర్లను కనిపెట్టి మరీ రెండు చోట్ల ఉంటే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి మరీ తొలగించేలా చేశారు.
కాపు సామాజికవర్గం...
ఇది ఒకరకంగా ఒక వ్యూహం ప్రకారం చేసిందే. ఇక చంద్రబాబుతో పవన్ కలిసినా సీఎం అభ్యర్థిగా పవన్ ను కాపు సామాజికవర్గం కోరుకుంటుందని తెలుసు. కానీ అది జరగదని భావించిన పవన్ కాపు సామాజికవర్గంలో కొంత ఓట్లనైనా తనవైపు మళ్లించుకునేలా ప్రయత్నాలను ప్రారంభించారు. అంతటితో ఆగలేదు. పవన్ కల్యాణ్ ను వ్యక్తిగత హననానికి కూడా జగన్ దిగారు. ఆయనకు మూడు పెళ్లిళ్లయ్యాయని, నాలుగో పెళ్లికి సిద్ధమంటూ మహిళ ఓటర్లలో ఎక్కువగా ఉన్న పవన్ అభిమానులను తనవైపునకు తిప్పుకునేలా ప్లాన్ చేసుకున్నారు. ఇవన్నీ ముందునుంచి జగన్ చేస్తున్నవే. ఇప్పటికిప్పడు చేస్తుంది కావు.
నివేదికల ప్రకారం...
ఇక సర్వే నివేదికల ప్రకారం ఓడిపోతామన్న నివేదికలు అందిన చోట అభ్యర్థులను మార్చేందుకు కూడా సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న చోట ఖచ్చితంగా మార్పు చేయడానికి సిద్ధమయ్యారు. ముందు నుంచే అందుకు ఎమ్మెల్యేలను మానసికంగా సిద్ధం చేశారు. పేరుకు గడప గడపకు ప్రభుత్వం పేరుతో వర్క్ షాప్ అని పెట్టి వీక్ గా ఉన్న ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేసినట్లే చేసి అందరూ తనవాళ్లేనని, అధికారంలోకి వస్తే వారికి పదవులు గ్యారంటీ అని హామీ కూడా ఇచ్చారు. మరి ఇన్ని రకాలుగా వ్యూహాలు పన్నుతున్న జగన్ కు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు కానీ, ముందుగానే వూహించి ఒక వ్యూహం ప్రకారం రెండేళ్ల నుంచే జగన్ ఎన్నికలకు గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారన్నది మాత్రం వాస్తవం. మరి చివరకు ఫలితం ఎలా ఉంటుందన్నది మాత్రం ఎవరూ చెప్పలేం.