India vs Afghanistan T20 : నా సామిరంగా.. మ్యాచ్ అంటే ఇదే కదా.. ఎన్ని సిక్సర్లు.. ఏమి బాదుడు?
బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో భారత్ - ఆప్ఘనిస్తాన్ మధ్య జరిగిన చివరి టీ 20 మ్యాచ్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది;
ఎంత టెన్షన్.. ఏమి బాదుడు... స్టేడియం మొత్తం సైలెన్స్.. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ... బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో నిన్న భారత్ - ఆప్ఘనిస్తాన్ మధ్య జరిగిన చివరి టీ 20 మ్యాచ్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. చివరకు టీం ఇండియానే గెలిచింది. రెండు సూపర్ ఓవర్లలో గాని విజయం తేలలేదు. దీంతో ఇండియా ఆప్ఘనిస్తాన్ పై జరిగిన మూడు మ్యాచ్ లలో 3 - 0 తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మొహాలీ, ఇండోర్ లో జరిగిన రెండు మ్యాచ్ లు ఏకపక్షంగానే సాగాయి. ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.
భారీ టార్గెట్...
తొలి రెండు మ్యాచ్ లలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్తాన్ తక్కువ పరుగులు చేయడంతో మనోళ్లు సునాయాసంగా కొట్టేశారు. ఇక మూడో మ్యాచ్ కు వచ్చే సరికి ట్యాస్ మనదే. అయినా రోహిత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే నాలుగు ఓవర్లలోనే నాలుగు వికెట్లను కోల్పోయి భారత్ కష్టాల్లో పడినట్లయింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ, రింకూ సింగూలు కలసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఇరవై ఓవర్లు ఆడి భారత్ కు 212 పరుగులు తెచ్చిపెట్టారు. రోహిత్ శర్మ 120 పరుగులు, రింకూ సింగ్ 68 పరుగులు చేశారు.
రెండు సూపర్ ఓవర్లు...
212 పరుగులంటే లక్ష్యం పెద్దదే. భారత్ ఈజీగా ఈ మ్యాచ్ గెలవాల్సి ఉంది. అయితే ఆప్ఘనిస్తాన్ బ్యాటర్లు కూడా చెలరేగిపోయారు. నైబ్, గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ లు ముగ్గురు హాఫ్ సెంచరీలు చేశారు. ఇలా ఆప్ఘనిస్తాన్ కూడా ఇరవై ఓవర్లకు ఆరు పరుగుల నష్టానికి 212 పరుగుల చేసింది. దీంతో మ్యాచ్ లో సూపర్ ఓవర్ వేయాల్సి వచ్చింది. అయితే తొలి సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్తాన్ 16 పరుగులు చేసింది. భారత్ కూడా అన్నే పరుగులు చేయడంతో రెండో సూపర్ ఓవర్ కు వెళ్లాల్సి వచ్చింది. రెండో సూపర్ ఓవర్ లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి పదకొండు పరుగులు చేసింది. దీంతో ఆప్ఘనిస్తాన్ దే విజయమనుకున్నారు. కానీ రవిబిష్ణోయ్ వరసగా రెండు వికెట్లు పడగొట్టి భారత్ కు విజయాన్ని అందించారు.