India vs Zimbabwe T20 : అరుదైన అవకాశం ఇక్కడ చెలరేగితే.. ఇక ప్లేస్ ఫిక్స్ అయినట్లే సోదరా?
నేడు ఇండియా - జింబాబ్వే మధ్య తొలి టీ20 జరగనుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ కు టీం ఇండియా ఇప్పటికే సిద్ధమయింది.
నేడు ఇండియా - జింబాబ్వే మధ్య తొలి టీ20 జరగనుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ కు టీం ఇండియా ఇప్పటికే సిద్ధమయింది. దీనికి యువనాయకత్వంతో పాటు యువజట్టుతో టీం ఇండియా బలంగానే కనిపిస్తుంది. టీ20 వరల్డ్ కప్ లో ఆడిన సీనియర్లు అందరికీ దాదాపు విశ్రాంతిని ఇవ్వాల్సి రావడంతో బీసీసీఐ కుర్రాళ్లకు అరుదైన అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న వాళ్లకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. కేవలం ఐపీఎల్ లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మ్యాచ్ లలో సత్తా చూపారన్న పేరు తెచ్చుకుని, విదేశీ గడ్డపై బ్యాట్, బంతితో చెలరేగిపోతే టీం ఇండియాలో ప్లేస్ ఫిక్స్ అయిపోతుంది.
సీనియర్ ఆటగాళ్లు...
ఎందుకంటే సీనియర్ ఆటగాళ్లు వరసగా రిటైర్ అయిపోతున్నారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ముగ్గురూ టీ 20లకు గుడ్ బై చెప్పేశారు. ఇంకా మరికొందరు మరో ఏడాదిలో రిటైర్ అయ్యే అవకాశాలు కూడా కొట్టి పారేయలేం. అందుకే యువ క్రికెటర్లకు ఇది అరుదైన అవకాశం. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించగలిగితే టీం ఇండియాలో స్థానం పదిలం చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు. ఈ మ్యాచ్ కు యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబేలు ఫస్ట్ మ్యాచ్ కు దూరంగా ఉన్నారు. వెస్టిండీస్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ కు వెళ్లిన ఈ ముగ్గురు జింబాబ్వేకు చేరుకోవడానికి కొంత సమయం పట్టే అవాకశముంది.
గిల్ నాయకత్వంలో...
భారత్ జట్టుకు శుభమన్ గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్శర్మ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, జితేశ్ శర్మ వంటి హిట్టర్లతో బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ వంటి బౌలర్లు కూడా సరైన సమయంలో వికెట్లు తీసుకునే అవకాశముంది. ఆవేశ్ ఖాన్, ముఖేశ్ కుమార్ లు మంచి ఫామ్ లో ఉన్నారు. అయితే ఐపీఎల్ లో ఆడివంత సులువు కాకపోయినా ఈ మ్యాచ్ లో రాణిస్తే సీనియర్లు పక్కకు వెళ్లినప్పుడు అవకాశం ఖచ్చితంగా దక్కుతుంది. జింబాబ్వేతో జరిగే టీ 20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుని యువ ఆటగాళ్లు తమ సత్తా చాటాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.