T20 ప్రపంచ కప్ లో గురువారం నాటి ఫలితం తర్వాత పాకిస్థాన్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. గ్రూప్ 2 మ్యాచ్‌లో పాకిస్థాన్.. జింబాబ్వే చేతిలో పరాజయం పాలైంది. ఇప్పుడు సెమీ-ఫైనల్ అవకాశాలు దాదాపు దూరమయ్యాయి. ఇప్పుడు పాకిస్థాన్ గ్రూప్ నుండి, భారత్.. దక్షిణాఫ్రికా రెండు బలమైన సెమీస్ పోటీదారులుగా ఉన్నాయి. పాకిస్థాన్ ప్రదర్శించిన ఆట తీరుపై తన నిరాశను వ్యక్తం చేస్తూ, వచ్చే వారం సెమీ-ఫైనల్స్ దశలో భారత జట్టు టోర్నమెంట్ నుండి నిష్క్రమిస్తుందని తాను ఆశిస్తున్నానని పాక్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం షోయబ్ అఖ్తర్ చెప్పాడు. పాకిస్థాన్ ఆట తీరు తమను నిరాశపరిచిందని అఖ్తర్ చెప్పాడు. ఈ వారంలో పాకిస్తాన్ స్వదేశానికి తిరిగి వస్తుందని నేను ఇంతకు ముందే చెప్పాను.. భారత్ కూడా సెమీఫైనల్ ఆడిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్తుంది, ఎందుకంటే భారత్ కు కూడా ఫైనల్ కు వెళ్లే అవకాశాలు పెద్దగా లేవని అఖ్తర్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పుకొచ్చాడు.