ఆసియా కప్ భారత్ సొంతం.. శ్రీలంక చిత్తు

Update: 2022-10-15 09:55 GMT

మహిళల ఆసియా కప్ ను భారత్ సొంతం చేసుకుంది. మొదట బౌలింగ్ లో రాణించిన భారత్.. ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఏ దశలో కూడా భారత్ కు పోటీని ఇచ్చేలా కనిపించలేదు. పరుగులు చేయాలని అనుకున్నప్పుడల్లా శ్రీలంక బ్యాటర్లు వికెట్లను కోల్పోతూ వచ్చారు. ముఖ్యంగా రనౌట్ల కారణంగా శ్రీలంక కీలక వికెట్లను కోల్పోయింది. ఇంటర్నేషనల్ స్టార్ అయిన ఆటపట్టు 6 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో శ్రీలంక శిబిరంలో ఆందోళన మొదలైంది. ఏ దశలో కూడా శ్రీలంక రన్ రేట్ మెరుగుపడలేదు. ముఖ్యంగా పేకమేడలా వికెట్ల పతనం సాగింది. 32 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో ఓ చిన్న భాగస్వామ్యం నమోదైంది. రణవీర 18 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. 13 పరుగులు రణసింఘే చేసింది. ఇక మిగిలిన బ్యాటర్లలో ఎవరూ డబుల్ డిజిట్ ను సాధించలేకపోయారు. భారత బౌలర్లలో రేణుక సింగ్ 3 మూడు వికెట్లు తీయగా.. గయక్వాడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు తీశారు.

ఇక ఛేజింగ్ లో భారత్ ను వైస్ కెప్టెన్ స్మృతి మందనా ఆదుకుంది. 25 బంతుల్లో 51 పరుగులు చేసి భారత్ కు విజయాన్ని అందించింది. మందనా ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక మరో ఓపెనర్ షెఫాలీ వర్మ 5 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. జెమీమా కేవలం రెండు పరుగులు చేసి పెవిలియన్ కు చేరింది. ఆఖర్లో హర్మన్ ప్రీత్ 11 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. దీంతో భారత్ 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఏడో సారి భారత్ ఆసియా కప్ ను సొంతం చేసుకుంది. టోర్నమెంట్ ను పెట్టిన తర్వాత భారత్ 2018లో టైటిల్ గెలవలేదు. మిగతా అన్ని సార్లు భారత్ దే టైటిల్.


Tags:    

Similar News