India Vs Australia T20 : డెత్ ఓవర్లంటే.. షివరింగ్.. మనోళ్లకు ఆ ఫీవర్ పోయేదెప్పుడు?
ఇండియన్ బౌలర్లకు డెత్ ఓవర్లంటే వణుకు పుడుతుంది. ఇండియా - ఆస్ట్రేలియా మూడో టీ 20 మ్యాచ్‌లోనే డెత్ ఓవర్లే కొంపముంచాయి
మనోళ్లకు డెత్ ఓవర్ల ఫీవర్ వెంటాడుతూనే ఉంది. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేేసే వాళ్ల లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. డెత్ ఓవర్లంటేనే వణికిపోతుండం.. పరుగులు సమర్పించుకోవడం అలవాటుగా మారింది. అదే మనకు అందాల్సిన విజయం చివరకు చేజారిపోతుంది. అయినా టీం ఇండియాలో మాత్రం డెత్ ఓవర్లలో ఎలా బౌలింగ్ చేయాలన్న దానిపై బౌలర్లకు సరైన శిక్షణ, కౌన్సిలింగ్ మ్యాచ్ కు ముందు ఇవ్వడం లేదన్న విమర్శలు వినపడుతున్నాయి. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ 20 లోనూ డెత్ ఓవర్లే కొంపముంచాయి. ఆ మూడు ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఉంటే విజయం మనదే అయి ఉండేది.
అత్యధిక పరుగులు చేసినా...
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 222 భారీ పరుగులే చేసింది. టీ 20లలో ఇంతటి టార్గెట్ ను ఛేదించాలంటే ప్రత్యర్థి జట్టుకు అంత సులువు కాదు. అందులోనూ ఆసీస్ ఐదు వికెట్లు కోల్పోయిన దశలో మనోళ్లు చెలరేగి ఆడాలి. చివరకు మూడు ఓవర్లలో కావాల్సినన్ని పరుగులు ఇచ్చేసి ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను భారత్ బౌలర్లు త్వరత్వరగానే అవుట్ చేయగలిగారు. కానీ పాతుకుపోయిన మ్యాక్స్‌వెల్, వేడ్ విషయంలోనే కొంత ఇబ్బంది పడ్డారు.
మూడు ఓవర్లలోనే....
చివరి మూడు ఓవర్లు.. అంటే... 18 బంతులు... చేయాల్సిన పరుగులు 49. పడాల్సిన టెన్షన్ ఆస్ట్రేలియా వైపే ఉంటుంది. కానీ విచిత్రమేంటంటే మనోళ్లు టెన్షన్ పడ్డారు. 18 ఓవర్లలో ఆరుగు పరుగులే ఇచ్చిన ప్రసిద్ధ కృష్ణ, 20వ ఓవర్ వచ్చేసరికి 21 పరుగులు ఇచ్చాడు. అలాగే అక్షర్ పటేల్ 22 పరుగులు ఇచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు. డెత్ ఓవర్లంటే ఎంత వణికిపోతున్నారో. వైడ్ లు.. నో బాల్ లు కూడా మన విజయానికి అడ్డుకట్ట వేశాయి. అందుకే భారత్ ఎప్పుడూ డెత్ ఓవర్లలో సమర్థంగా ఆడే బౌలర్లను ఎంపిక చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. మూడు ఓవర్లు కట్టడి చేసి ఉంటే విక్టరీ మనకు దక్కేది మాత్రమే కాకుండా సిరీస్ కూడా సొంతమయ్యేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.