మిస్టర్ 360 ఈ ఫార్మాట్ కు పనికి రాడా?
మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ వన్డేల నుంచి తొలగించాలన్న డిమాండ్ వినపడుతుంది.
సూర్యకుమార్ యాదవ్ వన్డేల నుంచి తొలగించాలన్న డిమాండ్ వినపడుతుంది. వరసగా విఫలమవుతున్న బ్యాటర్ ను ఎన్నాళ్లు పోషిస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిన్న జరిగిన విశాఖ మ్యాచ్ లో భారత్ దారుణ ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. ఏ ఒక్క బ్యాటరూ క్రీజులో కుదురుగా ఉండలేకపోయారు. ఓపెనర్లందరూ పెవిలియన్ దారి పట్టడంతో టీం ఇండియా అతి తక్కువ స్కోరుకు అవుట్ అయింది. కేవలం 117 పరుగులు అత్యల్ప పరుగులు చేసి ఇండియా విజయాన్ని ఆస్ట్రేలియాకు చేతిలో పెట్టింది.
వరసగా విఫలమవతూ...
సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది జనవరిలోనే వన్డేలో కొంత ఫామ్ లో కన్పించినట్లు అనిపించింది. ఆ తర్వాత షరా మామూలే. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో కూడా సూర్య డకౌట్ కావడం అభిమానులను నిరాశపర్చింది. విశాఖలో జరిగిన రెండో వన్డేలోనూ అంతే ఎల్‌బీడబ్ల్యూ అయి డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో సూర్య ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిస్టర్ 360 గా టీ 20లో పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్ రెండు వన్డేల్లోనూ అభిమానులను నిరాశపర్చడంతో వారంతా సూర్యను టీ 20లకే పరిమితం చేయాలని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.
చెన్నై మ్యాచ్ లో...
ఈ నెల 22వ తేదీన చెన్నైలో మూడో మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ సిరీస్ ను డిసైడ్ చేస్తుంది. ఇప్పటికే భారత్ - ఆస్ట్రేలియా 1 - 1 తో సమానంగా ఉన్నారు. చెన్నైలో జరిగే మ్యాచ్ ను కనుక టీం ఇండియా చేజార్చుకుంటే సిరీస్ ను కోల్పోయినట్లే. అందుకే సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ లో మరొకరికి అవకాశం ఇవ్వాలన్న కామెంట్స్ వినపడుతున్నాయి. కానీ కొన్నిసార్లు బ్యాటర్లు విఫలమవుతుంటారని, అంతమాత్రాన వన్డేల నుంచి తొలగించమంటే ఎలా? అన్న ప్రశ్నలు కూడా వినపడుతున్నాయి. మరి టీం ఇండియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంది.