సౌరవ్ గంగూలీ.. భారతదేశానికి కెప్టెన్ గా ఎన్నో సంవత్సరాలు తన సేవలను అందించాడు. ఆ తర్వాత కూడా పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ లో అత్యున్నత పదవిని చేపట్టాడు.. ఇక గంగూలీ 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. మరికొన్నిరోజుల్లో ఆయన పదవీకాలం ముగియనుంది. అయితే రెండో పర్యాయం బోర్డు అధ్యక్షుడిగా కొనసాగేందుకు న్యాయపరమైన అడ్డంకులు ఏవీ లేనప్పటికీ, బోర్డులోని ఇతర సభ్యుల నుంచి వ్యతిరేకత రావడంతో తప్పించారనే వార్తలు వస్తున్నాయి.
అందుకు తగ్గట్టుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలమయ్యాయి. గంగూలీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ గా పంపాలని ప్రధాని నరేంద్ర మోదీకి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. బీసీసీఐ అధ్యక్ష పదవి నుండి సౌరవ్ గంగూలీ తప్పించడం పట్ల మమతా బెనర్జీ సోమవారం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గంగూలీ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా బాగా చేసాడు. ఆయనకు మూడేళ్లపాటు బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించి ఆ పాత్రను చక్కగా పోషించారు.. పదవీకాలం పూర్తయిన తర్వాత, అతన్ని ఎందుకు తొలగించారో మాకు తెలియదు. అయితే అమిత్ షా కుమారుడు, జై షా మాత్రం అక్కడే ఉన్నాడు. అతను బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగడంలో మాకు ఎలాంటి సమస్య లేదు కానీ బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్‌ను ఎందుకు తొలగించారో తెలుసుకోవాలనుకుంటున్నామని అన్నారు. ఏం తప్పు చేశాడని గంగూలీని తొక్కేస్తున్నారు? గంగూలీ బెంగాల్ కు మాత్రమే కాదు, భారతదేశానికే గర్వకారణం.. ఎందుకు అతడిని ఇంత అమర్యాదకర రీతిలో సాగనంపుతున్నారు? అంటూ మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.
మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా షారుఖ్ ఖాన్ ను తొలగించి, అతడి స్థానంలో గంగూలీని నియమించాలని తెలిపింది. బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. గంగూలీని కాకుండా షారుఖ్ ఖాన్ ను బెంగాల్ అంబాసిడర్ గా ఎందుకు నియమించారని సువేందు అధికారి ప్రశ్నించారు. గంగూలీ గొప్పదనాన్ని ఇంత ఆలస్యంగా గుర్తించారా? అని మమతను నిలదీశారు. దీనిపై రాజకీయాలు చేయడం తగదని స్పష్టం చేశారు. క్రికెట్ పాలనా వ్యవహారాల్లో ప్రధానమంత్రి కలుగజేసుకోరన్న విషయాన్ని మమతా బెనర్జీ తెలుసుకోవాలని అన్నారు.