ఘోర ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ.. కోహ్లీపై ప్రశంసలు

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమిని ఎదుర్కొంది

Update: 2023-12-28 17:41 GMT

ViratKohli, RohitSharma

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమిని ఎదుర్కొంది. దక్షిణాఫ్రికా జట్టు సెంచురియన్ టెస్ట్ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 163 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 131 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులు చేసి ఫర్వాలేదనిపించిన టీమిండియా... రెండో ఇన్నింగ్స్ లో మరీ ఘోరంగా ఓటమిని మూటగట్టుకుంది. విరాట్ కోహ్లీ, శుభ్ మాన్ గిల్ మినహా మిగతా వారంతా సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకున్నారు. కోహ్లీ 76 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. గిల్ 26 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ కాగా, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 5, శ్రేయాస్ అయ్యర్ 6, కేఎల్ రాహుల్ 4, రవిచంద్రన్ 0, శార్దూల్ ఠాకూర్ 2, బుమ్రా 0, సిరాజ్ 4 పరుగులకు అవుటయ్యారు. సఫారీ బౌలర్లలో బర్గర్ 4 వికెట్లు పడగొట్టాడు. మార్కో యన్సెన్ 3, రబాడా 2 వికెట్లు తీశారు.

మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ, పరిస్థితులకు తగ్గట్టుగా ఆటతీరు మార్చుకోవడంలో విఫలమయ్యామని అన్నాడు. శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణలను ఈ మ్యాచ్ లో ఆడించడాన్ని తప్పుబట్టడంలేదని.. ఏదేమైనా ఈ టెస్టులో నెగ్గేందుకు అవసరమైన ఆటతీరును తాము కనబర్చలేదని అన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో ఫర్వాలేదనిపించే స్కోరు సాధించామని, కానీ బంతితో రాణించలేకపోయామని రోహిత్ శర్మ వివరించాడు. దానికి తోడు రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ వైఫల్యం ఓటమికి దారితీసిందని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ అద్భుతంగా ఆడాడని, కానీ టెస్టుల్లో గెలవాలంటే సమష్టి కృషి అవసరమని తెలిపాడు. ఈ ఓటమికి తామేమీ కుంగిపోవడంలేదని, రెండో టెస్టుకు తప్పకుండా పుంజుకుంటామని రోహిత్ శర్మ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. తొలి టెస్టులో విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జనవరి 3 నుంచి కేప్ టౌన్ లో జరగనుంది.


Tags:    

Similar News