డోమినికాలో విండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. విండీస్ బ్యాటర్లను ఏ మాత్రం కుదురుకోనివ్వకుండా చేసింది భారత బౌలింగ్ లైనప్. ఇప్పుడు భారత బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. రెండో రోజు రోహిత్ శర్మ, కుర్రాడు యశస్వి జైస్వాల్ సెంచరీలతో కదం తొక్కారు. కెప్టెన్ రోహిత్ శర్మ 103 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శుభమన్ గిల్ 11 బంతుల్లో కేవలం 6 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ విండీస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 96 బంతుల్లో 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు కోహ్లీ. జైస్వాల్ 143 పరుగులతో ఆడుతూ ఉన్నాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. భారత ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ జట్టుకి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి లంచ్ సమయంలోపే 100 పరుగుల్ని జోడించారు. టెస్ట్ క్రికెట్‌లో 17 సంవత్సరాల తర్వాత వెస్టిండీస్ గడ్డపై 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి ఓపెనింగ్ జోడీగా చరిత్ర సృష్టించింది. కరేబియన్ గడ్డపై 13 టెస్ట్‌ల తర్వాత భారత ఓపెనర్లు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న యశస్వీ జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఉండడంతో మూడో రోజు భారత్ ఎన్ని పరుగులు చేస్తుందో చూడాలి.
వెస్టిండీస్ జట్టు.. కేవలం 64.3 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. అలిక్ అతనేజ్ అనే బ్యాటర్ ఒక్కడే 47 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. భారత బౌలర్ల ధాటికి.. విండీస్ బ్యాటర్లలో ఎవ్వరూ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. ముఖ్యంగా.. రవిచందర్ అశ్విన్ అయితే విండీస్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. 24.3 ఓవర్లలో కేవలం 60 పరుగులే ఇచ్చిన అశ్విన్.. ఐదు వికెట్లు పడగొట్టాడు. జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. శార్దూల్, సిరాజ్ చెరో వికెట్ తీశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 162 పరుగుల లీడ్ లో ఉంది.