India Vs NewZealand Chmpions Trophy : న్యూజిలాండ్ పై విజయం మామూలుది కాదు.. అంచనాలుకు అందకుండా?
భారత్ - న్యూజిలాండ్ మధ్య దుబాయ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీం ఇండియా విజయం సాధించింది;

భారత్ - న్యూజిలాండ్ మధ్య దుబాయ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీం ఇండియా విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నా ఫలితం లేకుండా పోయింది. అయితే భారత్ బ్యాటర్లను కట్టడి చేయగలిగింది. భారత్ ను తక్కువ పరుగులకే అవుట్ చేయగలడంతో న్యూజిలాండ్ విజయం సులువు అని అందరూ అంచనా వేశారు. కానీ మన స్పిన్నర్లు మాత్రం న్యూజిలాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు మాత్రమే చేసింది. వన్డే లో ఇది తక్కువ పరుగులే అయినప్పటికీ, స్లో పిచ్ కావడంతో న్యూజిలాండ్ కొంత కష్టపడైనా ఛేదించగలదని భావించారు.
భారత్ బ్యాటర్లు...
శుభమన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వరసగా అవుట్ కావడంతో ఇక భారత్ పని అయిపోయిందనుకున్న తరుణంలో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ లు ఇద్దరూ నిలబడి 98 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ 79 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 42 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ అవుట్ అయిన వెంటనే కెఎల్ రాహుల్ కుదురుకున్నాడునుకునే లోగానే 23 పరుగుల వద్ద అవుట్ కావడంతో భారత్ 250 పరుగుల చేయడం కూడా కష్టంగానే కనిపించింది. అయితే హార్ధిక్ పాండ్యా 45 పరుగులు చేయడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు లభించింది. ఇది పెద్ద స్కోరు కాదన్న అభిప్రాయం అందరిలోనూ నెలకొంది. ఈ మ్యాచ్ లో ఇండియా ఓటమి తప్పదని అందరూ అంచనా వేశారు.
ఛేదనలో...
కానీ న్యూజిలాండ్ బ్యాటర్లు ఛేదనలో తడబడ్డారు. ప్రధానంగా భారత్ స్పిన్నర్లు కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపారు. విలియమ్సన్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. విలియమ్సన్ 81 పరుగులు చేసినా మిగిలిన ఆటగాళ్లు ఎవరూ క్రీజులో నిలబడలేదు. రచిన్ రవీంద్ర, యంగ్, మిచెల్, లేథమ్ ఇలా వరస బెట్టి తక్కువ పరుగులకే అవుట్ కావడంతో భారత్ విజయం దాదాపు ఖాయమైంది. 45.3 ఓవర్లలోనే న్యూజిలాండ్ ను భారత్ ఆల్ అవుట్ చేయగలిగింది. వరుణ్ చక్రవర్తి ఐదు, కులదీప్ యాదవ్ ఒకటి, జడేజా, హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరి ఒకటి వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ కథ ముగిసినట్లయింది. రేపు దుబాయ్ లో జరిగే సెమీ ఫైనల్స్ లో భారత్ ఆస్ట్రేలియాలతో తలపడనుంది.