రెండు సార్లు టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్ ను ఐర్లాండ్ ఇంటికి పంపించింది. సూపర్-12 లోకి అడుగుపెట్టాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో విండీస్ ను ఐర్లాండ్ చిత్తు చిత్తుగా ఓడించింది. భారీ హిట్టర్లు ఉన్న విండీస్ ను మొదట 146 పరుగులకే పరిమితం చేసిన ఐర్లాండ్.. ఆ తర్వాత ఛేజింగ్ లో ఏ మాత్రం తడబడకుండా లక్ష్యాన్ని చేధించింది. తొమ్మిది వికెట్ల తేడాతో విండీస్ ను చిత్తుచేసింది ఐర్లాండ్. 15 బంతులు మిగిలి ఉండగానే ఐర్లాండ్ లక్ష్యాన్ని చేధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఓపెనర్ మేయర్స్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ ఛార్లెస్ 18 బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. లివిన్ 13 పరుగులు, కెప్టెన్ పూరన్ కూడా 13 పరుగులతో విఫలమయ్యాడు. బ్రాండన్ కింగ్ 48 బంతుల్లో 62 పరుగులు చేసి ఓ మోస్తరు స్కోరును విండీస్ కు అందించాడు. స్మిత్ 12 బంతుల్లో 19 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. డీలానీ 3 వికెట్లు తీసుకున్నాడు.
లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ దూకుడుగా ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. పవర్ ప్లే లోనే 64 పరుగులు సాధించింది ఐర్లాండ్. బాల్బిర్నీ 23 బంతుల్లో 37 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. ఐర్లాండ్ స్టార్ పాల్ స్టిర్లింగ్ 66 పరుగులు చేసి విండీస్ కు చుక్కలు చూపించాడు. వికెట్ తీయాలని విండీస్ ఆటగాళ్లు ఎంతగా ప్రయత్నించినా రెండో వికెట్ సాధించడానికి కుదరలేదు. టక్కర్ 35 బంతుల్లో 45 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ విజయంతో ఐర్లాండ్ సూపర్-12 లోకి అడుగుపెట్టింది.