ఎన్నికల బడ్జెట్.. మూడు లక్షల కోట్లు
తెలంగాణ బడ్జెట్ ఈసారి మూడు కోట్లకు చేరనుంది. ఎన్నికల ఏడాది కావడంతో జనరంజకంగా బడ్జెట్ ను రూపొందించనున్నారు.
తెలంగాణ బడ్జెట్ ఈసారి మూడు కోట్లకు చేరనుంది. ఎన్నికల ఏడాది కావడంతో జనరంజకంగా బడ్జెట్ ను రూపొందించనున్నారు. గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై కసరత్తులు చేస్తున్నారు. ప్రగతి భవన్ లో అన్ని శాఖల అధికారులతో సమావేశమై వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండాలి? ఏ పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించాలి? కొత్త పథకాల రూపకల్పన వంటి వాటిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
దళితబంధును...
ఈ మేరకు ఆయన అధికారులకు సూచనలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ప్రధానంగా దళితబంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో కనీసం కొంతమందికి దక్కేలా నిధులు కేటాయిస్తారని చెబుతున్నారు. ఎస్సీ వర్గాల ఓట్లను ఆకట్టుకునే లక్ష్యంగా దళితబంధు ప్రవేశపెట్టిన తర్వాత ఆ వర్గం తమ పార్టీకి చేరువయిందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దీంతో పాటు గిరిజనబంధు పథకాన్ని కూడా త్వరలోనే వెల్లడించాలని నిర్ణయంచు కున్నారు. అలాగే మైనార్టీలకు సంబంధించి కూడా ఒక పథకాన్ని ప్రకటించే అవకాశముందని తెలిసింది.
నిరుద్యోగ భృతి...
ఇక నిరుద్యోగులకు ఇప్పటికే నోటిఫికేషన్లను విడుదల చేస్తూ కొంత యువతలో ఉత్సాహం నింపారు. నోటిఫికేషన్లతో పాటు నిరుద్యోగ భృతిని కూడా అమలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. అందుకోసం ఈ బడ్జెట్ లో నిధులు కేటాయింపు జరిగే అవకాశముందని భావిస్తున్నారు. నిరుద్యోగ యువతకు కేవలం భృతి మాత్రమే కాకుండా ప్రయివేటు రంగంలో ఉపాధి అవకాశాలపై కూడా ప్రత్యేకంగా కేసీఆర్ తన ప్రసంగంలో చోటు కల్పించనున్నారు. ఎస్టీ రిజర్వేషన్లపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం దాని అమలుపై కూడా ఈ సమావేశాల్లో ఒక స్పష్టత తీసుకురానున్నట్లు తెలిసింది.
రైతాంగం కోసం...
రైతాంగం కోసం ఇప్పటికే అనేక పథకాలను ప్రభుత్వం రూపొందించింది. రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. రైతు రుణమాఫీని కూడా అమలు చేశారు. మరోసారి రైతు రుణమాఫీని ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించే అవకాశముంది. రైతుల కోసం ఎరువులు, పురుగు మందులపై సబ్సిడీని కూడా కొనసాగించే వీలుంది. దీంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, వరిని కొనుగోలు చేస్తామని ఖచ్చితమైన హామని ఇవ్వడం ద్వారా రైతులను కూడా ఆకట్టుకునే ప్రయత్నాన్ని కేసీఆర్ చేయనున్నారని చెబుతున్నారు. పింఛన్ల సంఖ్య కూడా పెరిగే అవకాశముంది. మొత్తం మీద జనరంజక బడ్జెట్ రూపకల్పనలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఎప్పటికప్పుడు దీనిపై కేసీఆర్ అధికారులకు సూచనలు చేస్తున్నట్లు తెలిసింది.