హైదరాబాదీలకు కేసీఆర్ గుడ్ న్యూస్ చెబుతారా?

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 6 వ తేదీన శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఈ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్.

Update: 2023-02-03 11:58 GMT

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 6 వ తేదీన శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఈ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. ఎన్నికలకు వెళ్లాల్సిన తరుణంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్ పై ఎన్నో ఆశలున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాలకు మాత్రమే కాకుండా మరికొన్ని వర్గాలకు కూడా బడ్జెట్ లో వరాల జల్లు కురిసే అవకాశముందని తెలిసింది. హైదరాబాద్ లాంటి నగరంలో అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిపోయారు. ఇక్కడ ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా ఉంది. ఇప్పటకే హైదరాబాద్ లో ఫ్లైఓవర్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి.

నగరాభివృద్ధికి...
దీంతో పాటు అవుటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ కు మరింత అనుకూలంగా మారింది. ఈ నేపథ్యంలో నగరాభివృద్ధికి నిధులు కేటాయిస్తూ ఈ బడ్జెట్ లో నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఆనాడు అనేక హామీలను ఇచ్చింది. నగరం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో శివారు ప్రాంతాల అభివృద్ధికి కూడా సమగ్ర ప్రణాళికతో పాటు నిధులను కూడా కేటాయించే అవకాశాలున్నాయి. నగరంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాగా వేయాలంటే నగర వాసులను ఆకట్టుకోవాల్సి ఉంటుంది.
పెరుగుతున్న జనాభాకు...
ఇప్పటికే మెట్రో రైలు రెండో దశకు ఇటీవల కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాలకు తాగునీటి సరఫరా అందుతున్నప్పటికీ, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. వర్షం కురిస్తే నదులను తలపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక కూడా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో హైదరాబాద్ వాసులకు లబ్ది చేకూర్చేలా బడ్జెట్ ప్రతిపాదనలు భారీగానే ఉండనున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. భాగ్యనగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక నిధులను కేటాయించనున్నారు.
శివారు ప్రాంతాలకు....
ఇక హైదరాబాద్ తో పాటు శివారు మున్సిపాలిటీల అభివృద్ధిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ఈ మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడం ద్వారా కొంత మధ్యతరగతి ప్రజల ఓట్లను రాబట్టుకోవచ్చని ప్రభుత్వ యోచన. దీంతో పాటు హైదరాబాద్ నగరంలోని మురికివాడల అభివృద్ధి, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలపై కూడా బడ్జెట్ లో ప్రత్యేకంగా ప్రతిపాదనలు ఉంటాయని చెబుతున్నారు. ఎన్నికల్లో జంట నగరాల్లోని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా బడ్జెట్ కు రూపకల్పన చేయనున్నారు. రేషన్ కార్డులు, పింఛన్ల సంఖ్య కూడా హైదారాబాద్ లో పెంచేలా చర్యలు తీసుకోనున్నారని ప్రభుత్వ వర్గాల ద్వారా అందుతున్న సమాచారన్ని బట్టి తెలుస్తోంది. మొత్తం మీద జంట నగరవాసులకు ఈ బడ్జెట్ లో భారీగానే కేటాయింపులుంటాయంటున్నారు.


Tags:    

Similar News