అమిత్ షా తెలంగాణ పర్యటన కన్ఫర్మ్.. షెడ్యూల్ ఇదే
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగస్టు 27న తెలంగాణ పర్యటనకు రానున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగస్టు 27న తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఆగస్టు 27 సాయంత్రం ఖమ్మం లో జరిగే బీజేపీ రైతు సభ లో ఆయన పాల్గొననున్నారు. ఆ రోజు మధ్యాహ్నం భద్రాచలం రాములవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 27న ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2.10 గంటలకు కొత్తగూడెంకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం రాములవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తిరిగి భద్రాచలం దేవాలయం నుంచి రోడ్డు మార్గాన కొత్తగూడెంకు రానున్నారు. అక్కడి నుంచి 2.55 గంటలకు బీఎస్ఎఫ్ హెలికాప్టర్‌లో బయలుదేరి 3.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు.
అనంతరం అక్కడ జరిగే బీజేపీ రైతు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బహిరంగ సభ తర్వాత గంట పాటు తెలంగాణ బీజేపీ నేతలతో ఆయన సమావేశమై ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 5.45 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి గన్నవరానికి చేరుకుని.. సాయంత్రం 6.20 గంటలకు అమిత్ షా ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ఈ సభలో పలు పార్టీల నేతలు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో పలుమార్లు ఖమ్మంలో బీజేపీ సభ ఏర్పాటు చేసి.. అమిత్ షాను ఆహ్వానించింది. అయితే చివరి క్షణాల్లో ఆ పర్యటనలు రద్దయ్యాయి. దీంతో అప్పుడు డీలా పడ్డ తెలంగాణ బీజేపీ ఇప్పుడు నయా జోష్ తో సభను సక్సెస్ చేయాలని అనుకుంటూ ఉంది. భారీగా జన సమీకరణకు నాయకులు సిద్ధమయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని అంటున్నారు బీజేపీ నేతలు.