హమ్మయ్య.. ఎండలు పోయినట్లే.. ఊపిరిపీల్చుకున్న జనం.. చల్లబడిన వాతావరణం
నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత రెండు రోజుల నుంచి ఎండల తీవ్రత తగ్గింది
నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత రెండు రోజుల నుంచి ఎండల తీవ్రత తగ్గింది. ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 46 డిగ్రీల నుంచి యాభై డిగ్రీల వరకూ కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బయటకు రావడానికి కూడా భయపడిపోయారు. ప్రయాణాలను కూడా ఎండల తీవ్రత కారణంగా వాయిదా వేసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మార్చి నుంచే...
ఏప్రిల్ నెలలో ఎండలు దంచి కొట్టాయి. మార్చి నుంచే ఎండల తీవ్రత ప్రారంభమయింది. ఒక్క ఎండలు మాత్రమే కాదు.. వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో ప్రజలు అల్లాడి పోయారు. ఇంట్లో ఉన్నా ఉక్కపోతతో సక్రమంగా నిద్రకూడా కరవయింది. ఇక ఏసీ, ఫ్యాన్లు నిరంతరం ఆన్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్తు బిల్లులు గత రెండు నెలల నుంచి తడచి మోపెడయ్యాయి. అయినా సరే ఈ ఎండల నుంచి బయటపడతామా? అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ అనిపించింది. రోహిణికార్తెలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని భావించారు. ఎండల తీవ్రతకు వడదెబ్బ తగిలిఅనేక మంది మరణించారు.
ముందుగానే...
అయితే ఈసారి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోనూ వాతావరణం మారింది. ఎండల తీవ్రత నుంచి చల్లటి వాతావరణానికి మారడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులు కారణంగా అనేక వ్యాధులు వస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ప్రజలు కూడా బయటకు వస్తున్నారు. ఈసారి వర్షాలు కూడా ఎక్కువగా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో రెండు రోజులు పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.