జైలు నుంచి బండి విడుదల
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు;
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇరవై వేల పూచికత్తుతో ఇద్దరి జామీనుతో ఆయనకు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి హన్మకొండ తీర్పు వచ్చినా రాత్రి పది గంటలు దాటడంతో జైలు నుంచి బండి సంజయ్ విడుదల కాలేదు. పోలీస్ కమిషనర్ చెప్పిందంతా నిజమని ప్రమాణం చేయాలని బండి సంజయ్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత డిమాండ్ చేశారు. అన్నీ అసత్యాలు చెప్పారన్నారు. హిందీప్రశ్నపత్రాన్ని ఎవరైనా లీక్ చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. లీకు వీరులు, లిక్కర్ వీరులు కల్వకుంట్ల కుటుంబమేనని బండి సంజయ్ విమర్శించారు.
సిట్టింగ్ జడ్జితో...
ఈరోజు ఉదయాన్నే బీజేపీ న్యాయవాదులు కరీంనగర్ జిల్లా జైలుకు చేరుకుని బెయిల్‌కు సంబంధించిన పత్రాలను అధికారులకు సమర్పించారు. సంజయ్ బెయిల్ పై విడుదల కానుండటంతో పెద్దయెత్తున బీజేపీ శ్రేణులు కరీంనగర్ జైలు వద్దకు చేరుకున్నారు. జైలు వద్ద 144వ సెక్షన్ విధించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ పై సిట్టింగ్ జడ్జిపై విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్‌ను బర్త్‌రఫ్ చేయాలని ఆయన కోరారు. 30 లక్షల నిరుద్యోగ యువతను అన్యాయం చేసే ఆ ఇష్యూను పక్కన పెట్టడానికే పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ అంటూ కేకలు పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.