కట్నం తక్కువైందట.. గంటముందు పెళ్లి రద్దు చేసుకున్న వధువు
అమ్మాయికి రూ. 2 లక్షల కట్నం(కన్యాశుల్కం) ఇచ్చేలా కుల పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరింది.
పెళ్లీడుకి వచ్చిన యువతిని ఓ ఇంటిదాన్ని చేయాలంటే.. లక్షలకు లక్షలు కట్నాలు, సవర్ల కొద్దీ బంగారం ఉండాల్సిందే. అబ్బాయి ఉద్యోగస్తుడైతే అడిగినంతా ఇవ్వాలి. లేదంటే మరో సంబంధం చూసుకోవాలి. ఈ రోజుల్లో పెళ్లంటే జరిగే తంతు ఇదే. కానీ ఇక్కడ ఓ వధువు కట్నం తక్కువ ఇచ్చారని పెళ్లి రద్దుచేసుకుంది. తన భర్తకు తక్కువ కట్నం ఇచ్చినందుకు రద్దు చేసుకుందనుకుంటే పొరపాటే. ఆ వధువుకే ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన వరుడికి.. ముహూర్తానికి గంటముందుకు వధువు షాకిచ్చింది. హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్ లో మార్చి 9, బుధవారం రాత్రి జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే..
పోచారం మునిసిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. అమ్మాయికి రూ. 2 లక్షల కట్నం(కన్యాశుల్కం) ఇచ్చేలా కుల పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరింది. మార్చి 9న రాత్రి 7.21 గంటలకు ముహూర్తం. వివాహానికి ఘట్ కేసర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. పెళ్లి కోసం వరుడి తరపు కుటుంబ సభ్యులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ముహూర్తానికి సమయం దగ్గరపడుతున్నా.. వధువు, ఆమెతరపు బంధువుల జాడలేదు. ఆరాతీయగా.. అసలు విషయం తెలిసి వరుడు, అతని తరపు బంధువులంతా ఖంగుతిన్నారు.
తనకు రూ. 2 లక్షల కట్నం సరిపోదని, అదనంగా మరింత ఇస్తేనే వివాహం జరుగుతుందని వధువు తేల్చి చెప్పింది. ముహూర్తానికి ఇంకా గంట సమయమే ఉందనగా.. ఆమె ఈ విషయాన్ని చెప్పడంతో.. వరుడికి ఏం చేయాలో పాలుపోలేదు. కాసేపటికి పోలీసులను ఆశ్రయించగా.. యువతి తరపు వారిని స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు. అయినా ఆమె పంతం వీడలేదు. అడిగినంత కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుతుందని ఖరాకండిగా చెప్పేసింది. దాంతో వరుడు వధువుకి ఇచ్చి ఆ రూ.2లక్షలను కూడా వదిలేసుకుని వెళ్లిపోవడం గమనార్హం. అదనపు కట్నం కావాలని పెళ్లిపీటలపై వరుడు డిమాండ్ చేస్తున్న రోజుల్లో.. వధువు కూడా ఇలా చేయడంతో ఈ వార్త వైరల్ అయింది.