ఇకపై తేనెటీగ కుట్టినా తీపికబురే.! అదెలా.?

సార్స్ కోవ్ - 2 వైరస్‌ వేరియంట్లు రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకున్నా తేనెటీగ విషంలోని పెప్టైడ్స్ గుర్తిస్తాయట.

Update: 2022-05-04 11:17 GMT

others

తేనెతుట్టెను చూస్తే ఎవ్వరికైనా భయమే. పొరపాటున తేనెటీగలు లేచాయా పరుగందుకోవాల్సిందే. లేకుంటే వాటి దాడికి బలవ్వాల్సిందే. అయితే అందులో చిన్న ట్విస్ట్. ఇకపై తేనెటీగ కుట్టినా తీపికబురేనంటున్నారు పరిశోధకులు. కరోనా కష్టకాలంలో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. తేనెటీగ విషంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే పెప్టైడ్స్ ఉంటాయని.. అవి వైరస్ లోడ్‌ను భారీగా తగ్గిస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా అందులోనే ఉండే మరో పెప్టైడ్ వైరస్‌కి వ్యతిరేకంగా పోరాడుతుందట.

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సంస్థ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) పరిశోధకులు తేనెటీగల విషంపై జరిపిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కరోనా కాలంలో ఈ సంస్థ వైరస్ వ్యాప్తి, ప్రభావంపై పరిశోధనలు జరిపి వైరస్ కట్టడికి ఎంతగానో కృషి చేసింది. గాలి, నీటి ద్వారా వైరస్ వ్యాప్తి జరుగుతోందని గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసింది. తాజాగా కరోనా వైరస్ నియంత్రణపై జరిపిన పరిశోధనల్లోనూ కీలక విషయాలను గుర్తించింది.

సీసీఎంబీ జరిపిన పరిశోధనల్లో గ్రామిసిడిన్ ఎస్, మెలిటిన్ అనే పెప్టైడ్లు బ్యాక్టీరియాలపై ప్రభావవంతంగా పనిచేస్తాయని.. వాటికి వ్యతిరేకంగా ఏ శక్తినీ ఎదగనీయవని తేలింది. కరోనాకు మూలమైన సార్స్ కోవ్ - 2లోని పలు వేరియంట్లు మనిషి రోగనిరోధక శక్తి(ఇమ్యూన్ సిస్టమ్) నుంచి తప్పించుకున్నా పెప్టైడ్‌ల నుంచి తప్పించుకోలేవని చెబుతున్నారు. కరోనా వంటి వైరల్ ఇన్ఫెక్సన్స్ సోకినప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ పెప్టైడ్స్‌ను చికిత్సలో ప్రత్యామ్నాయంగా వాడుతున్నారని.. అలాంటి యాంటీ బ్యాక్టీరియల్ పెప్టైడ్స్ తేనెటీగ విషంలో ఉన్నాయని పేర్కొన్నారు.

సీసీఎంబీకి చెందిన పరిశోధకులు మహమ్మద్ గాలిబ్ ఇనాయతుల్లా, యష్ పరేఖ్, సరీనా, సుష్మా, రామక్రిష్ణన్, కిరణ్ కుమార్ జరిపిన పరిశోధనల్లో ఈ విషయాల్లో వెల్లడయ్యాయని నేచర్ జర్నల్‌లో ప్రచురితమైంది. సార్స్ కోవ్ - 2 వైరస్ సోకిన వ్యక్తులకు పెప్టైడ్స్ ఇచ్చిన 12 గంటల్లోనే వైరస్ తగ్గుముఖం పట్టిందని.. 24 గంటల్లో దాదాపుగా అంతమైందని ఆ పరిశోధనలో తేలింది.

Tags:    

Similar News