Telangana Elections : భారీగా పట్టుబడుతున్న నగదు.. పట్టుబడింది ఎంతో తెలిస్తే?
తెలంగాణ ఎన్నికల సందర్భంగా కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ఓటర్లను పంచడానికి అక్రమంగా డబ్బులను తరలిస్తూ పట్టుబడ్డారు.
తెలంగాణ ఎన్నికల సందర్భంగా కుప్పలుకప్పులుగా కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ఓటర్లను పంచడానికి అక్రమంగా డబ్బులను తరలిస్తూ పట్టుబడ్డారు. కోట్లాది రూపాయలను ఎన్నికల సమయంలో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించింది. అన్ని నియోకవర్గాల్లో నలువైపుల పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఫ్లైయింగ్ స్వ్కాడ్‌లు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఉమ్మడిగా దాడులు చేసి దాదాపు 724 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇంత పెద్ద స్థాయిలో నగదు, బంగారం, వస్తువులు పట్టుబడటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
కోడ్ అమలులోకి వచ్చాక...
తెలంగాణ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత మొత్తం 724 కోట్ల రూపాయల సొత్తు పట్టుబడినట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇందులో 292 కోట్ల రూపాయలు నగదు ఉంది. 123 కోట్ల విలువైన మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 39 కోట్ల రూపాయల విలువైన గంజాయి, హెరాయిన్ వంటి వాటిని సీజ్ చేశారు. వీటితో పాటు 186 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు కూడా పోలీసుల తనిఖీల్లో బయటపడ్డాయి. దీంతో పాటు 83 కోట్ల విలువైన వివిధ రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇంకా తనిఖీలు కొనసాగుతాయని తెలిపింది.