కామారెడ్డి మృతులకు ప్రధాని సంతాపం.. ఎక్స్ గ్రేషియా ప్రకటన

కామారెడ్డి రోడ్డుప్రమాదంలో చనిపోయిన మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు..

Update: 2022-05-09 06:11 GMT

ఎల్లారెడ్డి : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. డ్రైవర్ నిర్లక్ష్యమే 9 మందిని బలితీసుకోగా.. మరో 14 మంది ప్రాణాలకోసం ఆస్పత్రిలో పోరాడుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా.. కామారెడ్డి రోడ్డుప్రమాదంలో చనిపోయిన మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పీఎంఓ ఇండియా ట్వీట్ చేసింది. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు మోదీ. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు నష్టపరిహారం అందనుంది.

రోడ్డు ప్రమాద వివరాలను పరిశీలిస్తే.. పిట్లం మండలం చిల్లర్గికి చెందిన సౌదర్‌పల్లి మాణిక్యం గత గురువారం మృతి చెందారు. దశదినకర్మ అనంతరం నిన్న వారి కుటుంబ సభ్యులను టాటా ఏస్ వాహనంలో ఎల్లారెడ్డి పట్టణంలోని వారపుసంతలో అంగడిదింపుడు (చితికి నిప్పు అంటించిన వ్యక్తితో సంతలోని నిత్యావసర వస్తువులను ముట్టిస్తారు) కార్యక్రమానికి తీసుకెళ్లారు. తిరుగు పయనంలో హసన్‌పల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని టాటా ఏస్ ఢీకొట్టింది. ప్రమాదంలో టాటాఏస్ వాహనం నుజ్జు నుజ్జవ్వగా.. డ్రైవర్ సాయిలు (25), లచ్చవ్వ (45) అక్కడిక్కడే మృతి చెందారు. 21 మంది గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు, ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు మొత్తం 9 మంది మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 14 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


Tags:    

Similar News