రాష్ట్ర గీతం పై వివాదం.. అభ్యంతరం చెప్పిన తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్
జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది
జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలో జయజయాహే తెలంగాణ పాటను అధికార రాష్ట్ర గీతంగా ప్రకటించింది. అయితే ఈ పాటకి సంగీత దర్శకులు కీరవాణి సంగీతాన్ని అందించమని కోరటం చారిత్రక తప్పిదం అవుతుందని తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ అస్తిత్వం తెలిసి కూడా, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందో కూడా తెలిసి ఒక ఏపీకి చెందిన సంగీత దర్శకుడితో మ్యూజిక్ చేయించడమేంటని ప్రశ్నించింది.
పక్క రాష్ట్రాల వాళ్ల చేత...
మన ఉద్యోగాలు మనకే రావాలి,మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, సకల జనుల సహకారంతో ఎంతో మంది అమర వీరుల త్యాగ ఫలంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు పాడటమేంటి అని ప్రశ్నించారు.అలా చేయడం అంటే మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుందని తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ తెలిపింది. ఎంతో ప్రతిభావంతులు తెలంగాణాలో ఉన్నారని, తెలంగాణ కళాకారులకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి తెలంగాణ కళాకారులకి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నామని అసోసియేషన్ బహిరంగ లేఖ విడుదల చేసింది.