రెడ్ అలర్ట్.. రాష్ట్రాన్ని ముంచెత్తనున్న అతి భారీ వర్షాలు
హైదరాబాద్ కు మోస్తరు వర్షసూచన చేసింది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
హైదరాబాద్ వాతావరణశాఖ తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి మూడురోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా.. మంగళ, బుధ వారాలు (జులై25,26) భారీ నుంచి అతిభారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తనున్నాయని హెచ్చరించింది. ఇదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. వృద్ధులు, చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపింది.
నేడు మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్ కు మోస్తరు వర్షసూచన చేసింది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోగా.. అధికారులు ఇంకా ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని వాపోతున్నారు. గోదావరి, పెన్ గంగా, మూసీ నదులకు వరదనీరు భారీస్థాయిలో వస్తుండటంతో.. వాటి పరివాహక గ్రామాల్లోకి వరదనీరు చేరుతోంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.