Telangana : రానున్న రెండు గంటల పాటు హై అలెర్ట్.. ఈరోజు గడిస్తే చాలు

తెలంగాణ ప్రభుత్వానికి భారత వాతావరణశాఖ భారీ వర్ష సూచన చేసింది.

Update: 2024-08-31 12:18 GMT

తెలంగాణ ప్రభుత్వానికి భారత వాతావరణశాఖ భారీ వర్ష సూచన చేసింది. రానున్న రెండు గంటల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఈ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఉదయం నుంచే హైదరాబాద్ లో వర్షం కురుస్తూనే ఉంది.

రహదారులన్నీ...
దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. అయితే శనివారం కావడంతో ఐటీ ఆఫీసులకు సెలవు కావడంతో ఒకింత రద్దీ లేదు. హైదరాబద్ లో రోడ్లన్నీ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రోడ్ల మీదకు ఎవరూ రావద్దని అధికారులు సూచించడంత ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాపార సంస్థలు, ప్రయివేటు కార్యాలయాలు, ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లిన ఉద్యోగులు తమ వాహనాలతో కొంత బయటకు రావడంతో వారంతా వర్షపు నీటిలో చిక్కుకుపోయారు. దీంతో అనేక చోట్ల ట్రాఫిక్ స్థంభించిపోయింది.
మున్సిపల్ సిబ్బంది హెచ్చరిక...
నిత్యం ఒక సమయం లేకుండా రద్దీగా ఉండే ప్రదేశాలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. చిరు వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసుకున్నారు. ఎవరూ బయటకు రాకపోవడంతో వ్యాపారాలు జరగవని చిరు వ్యాపారులు కూడా ఇళ్లకు చేరుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. కొన్ని చోట్ల మట్టి ఇళ్లలో ఉంటున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. పురాతన భవనాలను కూడా ఖాళీ చేయాలని సూచించారు
గాలులు లేకపోవడం...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అన్ని అధికారుల సమన్వయంతో స్పెషల్ టీంలను ఏర్పాటు చేసుకుంది. టోల్ ఫ్రీ నెంబరును ప్రజలకు విడుదల చేసింది. మరో రెండు గంటల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయని తెలపడంతో ఉన్నతాధికారుల నుంచి సిబ్బంది వరకూ విధుల్లోనే ఉండి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి వర్షం తప్ప పెద్దగా గాలులు లేకపోవడంతో కొంత ఊరట అనే చెప్పాలి. భారీ వర్షం కారణంగా విద్యుత్తు సౌకర్యానికి చాలా చోట్ల అసౌకర్యం ఏర్పడింది. మరో రెండు గంటలు గడిస్తే చాలు అన్న రీతిలో బిక్కుబిక్కు మంటూ ప్రజలు గడుపుతున్నారు.


Tags:    

Similar News