అవును.. మాది తెలంగాణ కుటుంబ పార్టీనే : మంత్రి కేటీఆర్

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రజల 45 ఏళ్ల కల అని.. ఇంతవరకూ దానిపై స్పందించలేదన్నారు. గుజరాత్ కు రూ.20 వేల కోట్ల..

Update: 2023-07-08 14:40 GMT

వరంగల్ లో పర్యటించిన ప్రధాని మోదీ.. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వహించిన విజయసంకల్ప సభలో సీఎం కేసీఆర్ కుటుంబ రాజకీయాలు చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ప్రధాని చేసిన విమర్శలపై ప్రతి విమర్శలు చేశారు. తెలంగాణలో అభివృద్ధే జరగలేదన్న మోదీ.. 9 ఏళ్లలో యువత కోసం చేసిన ఒక్క మంచిపనైనా ప్రజలకు చెప్పి ఉంటే బాగుండేదని మంత్రి కేటీఆర్ అన్నారు.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రజల 45 ఏళ్ల కల అని.. ఇంతవరకూ దానిపై స్పందించలేదన్నారు. గుజరాత్ కు రూ.20 వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇచ్చిన మోదీ.. తెలంగాణలో మాత్రం రూ.520 కోట్లతో రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే అవుతుందన్నారు. దేశాన్ని పాలించిన ప్రధానుల చరిత్రలోకెల్లా అత్యధిక నిరుద్యోగాన్ని సృష్టించిన విఫల ప్రధాని మోదీ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేంద్రం పరిధిలో 16 లక్షల ఖాళీలను మోదీ భర్తీ చేయని మోదీ.. తెలంగాణలో 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
బిల్లులను ఆమోదించకుండా వర్సిటీల్లో ఖాళీల భర్తీని గవర్నర్ ఆపుతున్నారని, ఆమెకు మోదీ ఒక్కమాట చెబితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని రాకుండా అడ్డుకుని, అడవి బిడ్డల గురించి మాట్లాడటం ప్రధాని కపటప్రేమకు నిదర్శనమన్నారు. 15 వేలమంది స్థానికులకు ఉద్యోగాలిచ్చే బయ్యారం ఫ్యాక్టరీ గురించి ప్రధాని ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. నల్లచట్టాలతో 700 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్న ఘనత ప్రధానికే చెందిందన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధికై పాటుపడుతున్న తెలంగాణ కుటుంబ పార్టీ తమది అంటూ కేసీఆర్ కుటుంబ పాలనపై విమర్శలు చేసిన ప్రధానికి .. మంత్రి కేటీఆర్ రివర్స్ కౌంటరిచ్చారు.





Tags:    

Similar News