కొత్త రేషన్ కార్డుల గురించి గుడ్ న్యూస్
రాష్ట్రంలో చాలా ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయలేదు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే పథకాలకు ప్రామాణికత రేషన్ కార్డు. రాష్ట్రంలో చాలా ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయలేదు. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో కూడా కొత్త రేషన్ కార్డుల గురించే పెద్ద ఎత్తు దరఖాస్తులు చేశారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలను సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్త రేషన్ కార్డులను కూడా త్వరలోనే ఇస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లాలోని.. తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన త్వరలోనే కొత్త రేషన్ కార్డులను ఇస్తామని తెలిపారు. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే నాలుగు పథకాలను ప్రారంభించామని.. ఇందిరమ్మ రాజ్యంలో మాట ఇస్తే ఎంత కష్టం అయినా నెరవేరుస్తామన్నారు. అర్హులైన వారందరికీ అన్ని పథకాలు వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. ప్రజలందరి దీవెనలతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని.. తాను మంత్రిగా ఉండటానికి కారణం పాలేరు ప్రజలు పెట్టిన భిక్షేనని అన్నారు.