హైదరాబాద్ కు భారీ వర్షసూచన
నవంబరు 4వ తేదీ వరకూ నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. అలాగే సాయంత్రం..;
రానున్న మూడ్రోజుల్లో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య రుతుపవనాల కదలికలతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో నిన్న కురిసిన భారీ వర్షానికి ముగ్గురు మరణించారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతోనే రాగల మూడ్రోజుల్లో హైదరాబాద్ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
నవంబరు 4వ తేదీ వరకూ నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. అలాగే సాయంత్రం, రాత్రి సమయాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా.. మంగళవారం మధ్యాహ్నం నగరవ్యాప్తంగా తేలికపాటి వర్షం కురిసింది. 4 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాబోయే మూడు రోజుల్లో కనిష్ఠంగా 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, గరిష్ఠంగా 28 నుంచి 30 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.