Revanth Reddy : రేవంత్ రెడ్డి గట్టి టీంను రెడీ చేసుకున్నారా? బీఆర్ఎస్ కు ఆ విధంగా చెక్ పెడుతున్నారా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజురోజుకూ రాజకీయంగా స్ట్రాంగ్ అవుతున్నారు.;

Update: 2024-08-12 11:55 GMT

revanth reddy, chief minister, congress, telangana

రాజకీయాల్లో అనుభవం ముఖ్యం కాదు. అప్పటికప్పుడు అనువైన నిర్ణయాలు తీసుకోవడమే రాజకీయాల్లో రాణిస్తారు. గతంలో మంత్రి పదవి కూడా దక్కని రేవంత్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. ఇది ఆయన వద్దకు చేరిన పదవి కాదు. శ్రమించి.. చెమటోడ్చి తన వద్దకే పదవిని రప్పించుకున్నారు. ఉద్దండులను, సీనియర్ నేతలను తోసిరాజని ఆయన పదవి తెచ్చుకోవడం ఆషామాషీ కాదు. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ. ఒకరు ముందుకు నెడితే.... నలుగురు వెనక్కు లాగుతారు. అలాంటి కాంగ్రెస్ ను తన నాయకత్వంలో అధికారంలోకి తేవడం నిజంగా రేవంత్ రెడ్డి లక్కు అనే చెప్పాలి. పదేళ్లు ఎవరికీ సాధ్యం కానిది తాను చేసి చూపించారన్న పేరును హైకమాండ్ వద్ద తెచ్చుకోగలిగారు.

ప్రభుత్వాన్ని కూలదోస్తామని....
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనేక అనుమానాలు బయలుదేరాయి. బీఆర్ఎస్ నేతలే ఈ ప్రభుత్వాన్ని కూల్చి వేస్తామని బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని నేతలు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను సోదిలో లేకుండా చేయగలిగారు. ఒక్క సీటు రాకుండా చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఎందుకంటే రైతు రుణమాఫీతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలుకు తేదీలు చెప్పి మరీ ప్రజలను మరలా కాంగ్రెస్ వైపు సమర్థవంతంగా తిప్పగలిగారు. వచ్చింది ఎనిమిది స్థానాలయినా తక్కువమీ కాదు. ఎందుకంటే బీజేపీని తట్టుకుని మరీ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది పార్లమెంటు స్థానాలను దక్కించుకోగలిగింది.
ముఖ్యమైన నేతలను...
ఇక కాంగ్రెస్ లోనూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నాళ్లు ఉంటారన్న అనుమానం అందరిలోనూ కలిగింది. ఈ నేపథ్యంలో తన చుట్టూ ఉన్న టీంను ఆయన గట్టిగా చేసుకున్నారు. ముఖ్యంగా దళిత సామాజికవర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క లేకుండా రేవంత్ రెడ్డి అడుగు కూడా బయటపెట్డరు. ప్రతి కార్యక్రమంలో ఆయన తన వెంట ఉండేలా చూసుకుంటున్నారు. ఢిల్లీ వెళ్లినా.. మరో చోటకు వెళ్లినా భట్టికి ఇచ్చే గౌరవం మరొక నేతకు ఆయన ఇవ్వడం లేదు. అలాగే ఎన్నికలకు ముందు వరకూ తనపై ఒంటి కాలుపై లేచే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలను కూడా ఆయన దారికి తెచ్చుకోగలిగారు. ఎంతగా అంటే మరోసారి సీఎం రేవంత్ అనే అన్నంత తరహాలో వారు చేస్తున్న వ్యాఖ్యలు రేవంత్ వారిని ఏ రకంగా సెట్ చేయగలిగారో చెప్పకనే చెప్పాలి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను...
ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తన వైపునకు రప్పించడంలో కూడా రేవంత్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మైండ్ గేమ్ ఆడి కొందరు నేతలను నేరుగా బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి తెచ్చుకోగలిగారు. స్థానికంగా కాంగ్రెస్ నాయకత్వం నుంచి కొంత ఇబ్బందులు ఎదురయినప్పటికీ రేవంత్ రెడ్డి వారిని బుజ్జగించి మరీ పార్టీలో చేర్చుకున్నారు. జగిత్యాల వంటి చోట సీనియర్ నేత జీవన్ రెడ్డి అలక బూనినా అక్కడి నుంచి సంజయ్ కుమార్ కు పార్టీ కండువా కప్పడంలో సక్సెస్ అయ్యారు. ఇలా ఒక్కొక్కటి అధిగమిస్తూ అసెంబ్లీలో, మండలిలో కాంగ్రెస్ బలాన్ని పెంచుకుంటూ పోతున్నారు. నిత్యం ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వెంటనే పరిష్కారానికి చూపుతూ కేసీఆర్ కు, తనకు మధ్య తేడాను చూపిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి రోజు రోజుకూ స్ట్రాంగ్ అవుతున్నారు. ఇక అమెరికా పర్యటనతో పెట్టుబడులు తేవడంలో సక్సెస్ అయి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమాత్రం తీసిపోమని నిరూపించుకోగలిగారు.


Tags:    

Similar News