కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సారధ్యంలో సాగుతున్న భారత్ జోడో యాత్రలో దొంగలకు కార్యకర్తలు భయపడుతూ ఉన్నారు. పిక్ పాకెటర్స్ బెడద చాలా ఉందని.. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. యాత్ర రాష్ట్రాలు మారినా.. దొంగల బెడద మాత్రం తగ్గలేదని వాపోతున్నారు. రాహుల్ గాంధీని చూడాలని తరలివచ్చే జనంపై దొంగలు పడిపోతూ.. దొరికింది దోచేసుకుంటూ ఉన్నారు. ఆదివారం ఉదయం రాహుల్ గాంధీని చూసేందుకు గొల్లపల్లి సమీపంలోకి వచ్చిన జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామానికి చెందిన బాబర్ ఖాన్ జేబులో నుండి రూ. 54000, రాములు అనే వ్యక్తి నుండి 74 వేల రూపాయలు దొంగలు కొట్టేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. యాత్రలో పలువురు నగదుతోపాటు, సెల్ ఫోన్లను కోల్పోయినట్లు వాపోతున్నారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. రాష్ట్రంలో ఐదో రోజు యాత్రలో భాగంగా ఆదివారం ఉదయం జడ్చర్లలో రాహుల్ పాదయాత్రను కొనసాగించారు. యాత్రలో నడుస్తున్న రాహుల్ వద్దకు కొంతమంది చిన్నారులు వచ్చారు. ఇంతలో మనం పరుగెడదామా.. రెడీ వన్ టు త్రీ అంటూ ఆయన రన్నింగ్ మొదలు పెట్టారు. రాహుల్ ను చూసి పక్కనే ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పరుగు అందుకున్నారు. మిగతా నాయకులు, భద్రతా సిబ్బంది కూడా పరుగెత్తారు. అలా కొద్దిదూరం వెళ్లిన తర్వాత పరుగు ఆపిన రాహుల్ మళ్లీ నడవడం కొనసాగించారు. రాహుల్ ఈ రోజు 22 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సాయంత్రం ఆయన షాద్‌నగర్‌లోని సోలిపూర్ జంక్షన్ వద్ద సభలో పాల్గొంటారు. నవంబర్ ఏడో తేదీ వరకు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది.