పీఆర్సీ జగన్ మెడకు చుట్టుకోనుందా?
పీఆర్సీ నివేదికపై నేడు జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజు ఉద్యోగ సంఘాలతో జగన్ భేటీ కానున్నారు.
పీఆర్సీ నివేదికపై నేడు జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజు ఉద్యోగ సంఘాలతో జగన్ భేటీ కానున్నారు. ఫిట్ మెంట్ చార్జీలపై చర్చించనున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్ 34 శాతానికి తగ్గకుండా చూడాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. చీఫ్ సెక్రటరీ కమిటీ 14.29 శాతం మాత్రమే ఫిట్ మెంట్ ఇవ్వాలని సిఫార్సు చేసింది.
ఈరోజు జరిగే...
అయితే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం 14 నుంచి 27 శాతం మధ్యలో ఒక నెంబరు చెప్పాలని ఉద్యోగ సంఘాలను కోరారు. కానీ ఈరోజు జగన్ తో జరిగే సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. మధ్యే మార్గంగా జగన్ 30 శాతం ఫిట్ మెంట్ ను ఇచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల్లో ఫిట్ మెంట్ ప్రభుత్వ ఖజానాకు అదనపు భారం అవుతుంది.
సంతృప్తి చెందుతాయా?
వచ్చే ఏప్రిల్ నుంచి దీనిని అమలులోకి తెచ్చే అవకాశముంది. అయితే జగన్ ప్రకటించే ఫిట్ మెంట్ శాతంపై ఉద్యోగ సంఘాలు సంతృప్తి చెందుతాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దశలవారీగా చేస్తున్న ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఏపీ ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి కూడా. అరియర్స్ ను కూడా రెండు, మూడు దఫాలుగా ఇచ్చే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉంది.
వచ్చే ఎన్నికల్లో....
ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. గత ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి అండగా నిలిచారు. వారి మద్దతు ఈసారి ఎన్నికల్లో కూడా జగన్ కు అవసరం. అయితే ఉద్యోగ సంఘాలు కూడా పట్టువిడుపులు ప్రదర్శించాలని ప్రభుత్వం కోరుతోంది. ఆర్థిక పరిస్థిితి, కరోనా తీవ్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వానికి సహకరించాలని నేడు జగన్ ఉద్యోగ సంఘాలను కోరే అవకాశముంది.