వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనపై హత్యాయత్నం జరిగిందని ఆయనకు మొదట తెలియదట. ఏదో చిన్న దెబ్బ తగిలిందని భావించారని, ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని హైదరాబాద్ వెళ్లారని అక్కడ ప్రత్యక్షంగా జగన్ తో పాటు ఎయిర్ పోర్ట్ లో ఉన్న నేతలు చెబుతున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జగన్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉందని, అయితే ఎయిర్ పోర్ట్ లో ఈ సంఘటన జరగడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని తాము సూచించినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కానీ జగన్ చిన్న దెబ్బే కదా? ఎందుకు హడావిడి హైదరాబాద్ వెళ్లిపోతానని ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని వెళ్లారంటున్నారు.
లా అండ్ ఆర్డర్ ప్లాబ్లమ్ వచ్చేది.....
అయితే జగన్ విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ ఆఘమేఘాల మీద వెళ్లిపోవడాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో సహా అందరూ తప్పుపడుతున్నారు. దీనికి వైసీపీ నేతలు కూడా ధీటైన సమాధానం ఇస్తున్నారు. జగన్ నిజంగానే హైదరాబాద్ వెళ్లకుండా అంబులెన్స్ లో విశాఖ ఆసుపత్రిలో అడ్మిట్ అయిఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పేవంటున్నారు. హైదరాబాద్ వెళ్లారు కాబట్టి జగన్ క్షేమంగా ఉన్నారని రాష్ట్ర్రంలో పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు స్వాంతనతో ఉన్నారని, విశాఖలో ఆసుపత్రిలో చేరిఉంటే తమ కార్యకర్తలను అదుపు చేయడం తమకూ కష్టంగా మారేదంటున్నారు వైసీపీ నేతలు. మొత్తం మీద జగన్ విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ చేరుకోవడాన్ని టీడీపీ ప్రధానంగా తప్పుపడుతోంది.