ఈయన వచ్చారో ఇక అంతే... బాబుకు అల్టిమేటం

మాజీ మంత్రి రావెల కిషోర్ టీడీపీలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

Update: 2021-11-16 12:30 GMT

మాజీ మంత్రి రావెల కిషోర్ టీడీపీలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రధానంగా ఆయనను ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సీటును పొత్తులో భాగంగా ఎవరికి ఇచ్చినా ఒప్పుకోమని కూడా ప్రత్తిపాడు టీడీపీ నేతలు చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో రావెల కిషోర్ బాబు పరిస్థితి రాజకీయంగా మరోసారి ఇబ్బందిగా మారనుంది.

రాజకీయాలలోకి రాగానే...?
రావెల కిశోర్ బాబు ఐఆర్ఎస్ అధికారి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 2014 లో సరైన స్టెప్ వేశారు. తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆయనకు ప్రత్తిపాడు నియోజకవర్గం టిక్కెట్ ను చంద్రబాబు కేటాయించారు. ఎస్సీ నియోజకవర్గం కావడం, టీడీపీకి ఆ ఎన్నికల్లో జనం అండగా నిలబడటంతో రావెల కిశోర్ బాబు గెలిచారు. అయితే ఆయన అదృష్టం బాగుండటంతో వెంటనే మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు.
సొంత పార్టీలోనే...
కానీ రావెల కిశోర్ బాబు ప్రత్తిపాడు నియోజకవర్గంలో స్వతంత్రంగా వ్యవహరించేందుకు ప్రయత్నించారు. అదే ఆయనకు ముప్పు తెచ్చింది. ప్రత్తిపాడు నియోజకవర్గం ఎస్సీ అయినా అక్కడ కమ్మ సామాజికవర్గం నేతలదే ఆధిపత్యం. దీంతో రావెల కిశోర్ బాబును మంత్రి పదవి నుంచి తప్పించారు. ఇక మంత్రి వర్గం నుంచి తనను తప్పించిన తర్వాత రావెల కిశోర్ బాబు ఎమ్మెల్యే టర్మ్ పూర్తయ్యేంత వరకూ పార్టీలోనే ఉండి ఆ తర్వాత జనసేనలోకి జంప్ చేశారు.
మళ్లీ ప్రయత్నాలు...
2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయిన రావెల కిశోర్ బాబు ఫలితాల తర్వాత బీజేపీలోకి జంప్ అయ్యారు. కానీ బీజేపీలో ఉన్నా మరోసారి గెలవలేమని భావించి ఆయన టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రలోనూ ఆయన పాల్గొని సంఘీభావం ప్రకటించారు. దీంతో పాటు పల్నాడుకు చెందిన టీడీపీ నేతతో రాయబారం పంపినట్లు తెలిసింది. అయితే రావెల ప్రయత్నాలు తెలుసుకున్న ప్రత్తిపాడు టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. మొత్తం మీద టీడీపీలో వెళ్లేందుకు రావెల చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవచ్చు.


Tags:    

Similar News