హైదరాబాద్ ను తాను నిర్మించలేదని, తాను సైబరాబాద్ ను నిర్మించానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం శెరిలింగంపల్లి నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలోనే ఆదర్శంగా ఉండేందుకు సైబరాబాద్ పేరుతో ఆర్థిక, ఆధునిక నగరాన్ని టీడీపీ హయాంలో నిర్మించానన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో రోడ్లే లేవని, తానే వేయించానని చెప్పారు. సింగపూర్ కి వెళ్లి రాత్రి 12 గంటలకు అక్కడ రోడ్లు ఎలా ఊడుస్తారో చూసి ఆ విధానాన్ని హైదరాబాద్ లో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటి సైబరాబాద్ ను అప్పజెప్తే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. ఇలాంటి ఆదాయం వచ్చే నగరం దేశంలోనే ఎక్కడా లేదన్నారు. తాను ఒక విజన్ తో ముందుకెళ్లి సైబరాబాద్ నిర్మించామని, తర్వాత వచ్చిన కాంగ్రెస్ కూడా చెడగొట్టకుండా ముందుకు తీసుకెళ్లిందని, ఇప్పడు కేసీఆర్ వచ్చి మొత్తం చెడగొట్టారన్నారని ఆరోపించారు.