ఆ షరతులకు బాబు అంగీకరిస్తారా?

చంద్రబాబు జనసేనతో కలసి నడించేందుకు దాదాపుగా సిద్ధమయ్యారు. ఇక బీజేపీ విషయంలోనే ఎటూ తేలకుండా ఉంది.;

Update: 2022-03-20 13:09 GMT

రాజకీయాల్లో దేనికైనా టైమింగ్ అవసరం. ప్రజల నాడిని పసిగట్టి సరైన నిర్ణయం తీసుకుంటే గెలుపు ఆ పార్టీ గుమ్మం తాకుతుంది. ఏపీలోనూ ఇప్పుడు చంద్రబాబు అదే ప్రయత్నిస్తున్నారు. సామాజికవర్గాలు, ఎలక్షనీరింగ్ కోసం జనసేన, బీజేపీ మద్దతు అవసరమని చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారు. పవన్ కల్యాణ‌్ సైడ్ నుంచి దాదాపు ఓకే అయినట్లే. ఆయన టీడీపీతో కలసి నడించేందుకు దాదాపుగా సిద్ధమయ్యారు. ఇక బీజేపీ విషయంలోనే ఎటూ తేలకుండా ఉంది.

మరోసారి నమ్మి....
ప్రధానంగా బీజేపీ కేంద్ర నాయకత్వం చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోయేందుకు సిద్థంగా లేదు. అలాగని ఏపీలో పొత్తులతోనే ముందుకు వెళితే నాలుగైదు సీట్లు దక్కించుకోవచ్చు. వచ్చే పార్లమెంటు ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకం. కనీసం దక్షిణాది రాష్ట్రాల్లో కనీస స్థానాలను సాధించాలి. తెలంగాణ, కర్ణాటకల్లో కొంత సీట్లు సాధించే అవకాశాలున్నాయి. ఏపీలోనే పార్టీ ఎటూ కాకుండా ఉంది. ఒక్క జనసేనతోనే కలసి వెళితే సీట్లు వస్తాయా? రావా? అన్న అనుమానం కూడా లేకపోలేదు.
రెండు వర్గాలుగా.....
చంద్రబాబును పూర్తిగా నమ్మలేని పరిస్థిితి అని ఇప్పటికే రాష్ట్రంలోని కొందరు నేతలు హైకమాండ్ కు తెలియజేశారు. మరో వర్గం మాత్రం టీడీపీ అండ లేకుండా పార్టీని గెలిపించుకోవడం కష్టమేనని మరొక వర్గం చెబుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలుపుకుని వెళ్లాలా? లేదా? అన్న దానిపై ఇంకా తేల్చుకోలేదు. అనివార్యంగా కలుపుకోవాల్సిన పరిస్థితి వస్తే బీజేపీ కొన్ని షరతులను విధించే అవకాశముంది.
కొత్త ఫార్ములాతో.....
బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకునే విధంగా ఒక ఫార్ములాను రూపొందించే అవకాశముంది. బీజేపీకి సీఎం పదవి కాకపోయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి తొలి రెండున్నరేళ్లు ఇవ్వాలన్న ట్విస్ట్ ఇచ్చే అవకాశముందంటున్నారు. అంతేతప్ప బేషరతుగా చంద్రబాబును ఈసారి కలుపుకుని వెళ్లే అవకాశాలు లేవని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు బీజేపీని కలుపుకుని పోవడం ఈసారి అంత సులువుగా మాత్రం కన్పించడం లేదు.


Tags:    

Similar News