బేరాలేవమ్మా... బెస్ట్ ఆప్షన్ అదేనమ్మా..?
చంద్రబాబుకు పవన్ అవసరం. పవన్ కు టీడీపీ అవసరం. ఇద్దరూ కలవడానికి ముఖ్యమంత్రి పదవి అడ్డుగా మారింది.
చంద్రబాబుకు పవన్ అవసరం. పవన్ కు టీడీపీ అవసరం. ఇద్దరూ కలవడానికి ముఖ్యమంత్రి పదవి అడ్డుగా మారింది. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై చర్చ జరుగుతుంది. జనసేన అధినేత జనం ముందు ఉంచిన మూడు ఆప్షన్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ తో పొత్తు లేకుంటే ఈసారి విజయం సాధ్యం కాదని చంద్రబాబుకు తెలియంది కాదు. గత ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం.
గత ఎన్నికల్లో....
2019 ఎన్నికల్లో టీడీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. కానీ వచ్చింది 23 సీట్లు మాత్రమే. వచ్చిన ఓట్ల శాతానికి, దక్కిన సీట్లకు మధ్య పొంతనే లేదు. దాదాపు యాభై నుంచి అరవై సీట్లు తక్కువ మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అది జనసేన విడిగా పోటీ చేయడం వల్లనేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జనసేన ఓట్లు చీల్చడం వల్లనే తమ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని చంద్రబాబు సయితం అంగీకరించాలంటున్నారు. అధికారంలోకి రావాలంటే తమ మద్దతు అవసరమని గుర్తించాలని లెక్కలతో వివరస్తుంది. పవన్ ను ముఖ్యమంత్రిగా చేస్తే పొత్తు పెట్టుకోవడానికి తమకు అభ్యంతరం లేదని జనసైన ముఖ్యనేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా జనసేనకు ఒరిగే నష్టమేమీ లేదు. 2029 నాటికి టీడీపీ స్థానంలో ప్రత్యామ్నాయ పార్టీగా తాము ఎదుగుతామని జనసేన భావిస్తుంది. టీడీపీ అంగీకరించకపోయినా బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయాలని భావిస్తుంది.
కిందిస్థాయి క్యాడర్ మాత్రం...
మరో వైపు వైసీపీని ఓడించాలంటే ఖచ్చితంగా జనసేనతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ నేతలు చెబుతున్నారు. కానీ కిందిస్థాయి క్యాడర్ ఇందుకు విముఖంగా ఉంది. ప్రజల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలని బలమైన కోరిక ఉందని, క్షేత్రస్థాయిలో నాడి తమకు తెలుసునని, అందుకే ఒంటరిగా పోటీ చేయాలని సూచనలు అందుతున్నాయి. ద్వితీయ శ్రేణి నేతల నుంచి చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేయాలని అభ్యర్థనలు అందుతున్నాయి.
ఎవరికి వారే....
మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తే గెలిపించుకునే బాధ్యత తమదేనంటూ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చెబుతున్నారు. దీంతో చంద్రబాబు ఆలోచనలో పడ్డారు. పొత్తుల విషయంలో ఎన్నికలు చివర నాటికి తేలుద్దామని, ఇప్పుడే ఆలోచించవద్దని చంద్రబాబు సూచించారట. 175 నియోజకవర్గాల్లో టీడీపీని బలోపేతం చేసే దిశగా తమ ప్రయత్నాలు ఉంటాయని, కార్యకర్తలు గ్రాస్ రూట్ లో ఏం జరుగుతుందో తెలుసునని సీనియర్ నేతల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించారట. అంటే చంద్రబాబు మనసులోనూ జనసేనతో బేరాలకు సంసిద్ధంగా లేరనే అర్థమవుతుంది. ప్రజలు కూడా తమ ఓటును దుర్వినియోగం చేసుకోరని, ఈసారి తెలుగుదేశం ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ ను దాటుతుందన్న నమ్మకం చంద్రబాబులో కనపడుతుంది. పవన్ కూడా తన వ్యూహంలో తాను ఉన్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.