నేతలను కాపాడుకోవడమే ఇప్పుడు పెద్దపని
చంద్రబాబు తన పార్టీ నేతలను రక్షించుకోవాల్సిన పని పడింది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది.
మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ఉంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిస్థితి. బీజేపీ పెద్దలతో టచ్ లోకి వెళదామనుకుంటున్న ఆయనకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు కమలనాధులు. అమిత్ షా తిరుపతికి వచ్చి మరీ పొత్తుకు గోవిందా అని చెప్పేసి వెళ్లినట్లయింది. ఇక చంద్రబాబు తన పార్టీ నేతలను రక్షించుకోవాల్సిన పని పడింది. ఇప్పటి వరకూ పార్టీ బలోపేతం, వైసీపీ ప్రభుత్వంపై ఆందోళనలపైనే చంద్రబాబు దృష్టి పెట్టారు.
బీజేపీ నుంచి...
కానీ ఇప్పుడు చంద్రబాబు బీజేపీ నుంచి నేతలను రక్షించుకోవాల్సిన పని పడింది. అమిత్ షా తిరుపతిలో ఏపీ బీజేపీ నేతలకు సరైన రూట్ మ్యాప్ ఇచ్చి వెళ్లారు. టీడీపీ, వైసీపీలను శత్రువులుగానే చూడాలని ఆయన చెప్పారు. అంతేకాదు ఇతర పార్టీల నేతలను వీలయినంత త్వరగా పార్టీలోకి చేర్చుకోవాలని అమిత్ షా పార్టీ నేతలకు టార్గెట్ పెట్టి మరీ వెళ్లారు. ఇప్పుడు ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసిందనే చెప్పాలి.
టీడీపీ నేతలను...
మరి బీజేపీ లోకి ఎవరు చేరుతారు. అధికార వైసీపీ నుంచి బీజేపీలో చేరేవారు చాలా తక్కువ. ఎందుకంటే పార్టీ పవర్ లో ఉంది. ఇక మిగిలింది జనసేన, టీడీపీలే. జనసేన ఆల్రెడీ బీజేపీ మిత్రపక్షంగా ఉంది కాబట్టి అక్కడి నుంచి చేరికలు ఉండే అవకాశాలు లేవు. ఇక మిగిలింది టీడీపీ ఒక్కటే. టీడీపీ ప్రస్తుతం బలహీనంగా ఉంది. ఇప్పుడిప్పడే పార్టీ క్యాడర్ ను చంద్రబాబు వీధుల్లోకి తెస్తున్నారు. ఈ సమయంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నుంచి నేతలను కాపాడుకోవాల్సి ఉంటుంది.
జనసేన పొత్తు ఉండటంతో....?
బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ కేంద్రంలో పవర్ లోకి వస్తుందన్న నమ్మకం ఉంది. ఇక్కడ టీడీపీ పరిస్థితి అలా లేదు. జనసేన పొత్తు ఉంది కాబట్టి టీడీపీ నుంచి బీజేపీలో చేరడమే బెటర్ అని కొందరు టీడీపీ నేతలు ఆలోచించే అవకాశాలున్నాయి. ప్రధానంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జల్లాల నుంచి టీడీపీ నేతలను బీజేపీ ఆకర్షించే అవకాశాలున్నాయి. అందుకే చంద్రబాబుకు ఇప్పుడు రెండు పార్టీల నుంచి ముప్ప పొంచి ఉందనే చెప్పాలి. నేతలను గంప కింద కోడిపిల్లల్లా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.