ఆ ధైర్యం ఉందా? : జగన్ సవాల్

ఈరోజు రాష్ట్రంలో యుద్ధం జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తెనాలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట;

Update: 2023-02-28 07:10 GMT

ఈరోజు రాష్ట్రంలో యుద్ధం జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి కడుపు మంట పుడుతుందన్నారు. కడుపు మంటకు, అసూయకు మందు లేదన్నారు. ఈ యుద్ధంలో గెలుపు ఎవరిదన్నది ప్రజలు నిర్ణయిస్తారన్నారు. తెనాలిలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. కరువుకు కేరాఫ్ అయిన చంద్రబాబుకు రైతు ప్రభుత్వమైన జగన్ కు మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో యుద్ధం ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీలకు వ్యతిరేకమన్న పెత్తందారీ పార్టీలకు మనకు మధ్య జరుగుతుందని తెలిపారు. ఇచ్చిన మ్యానిఫేస్టోలో 98 శాతం హామీలను నెరవేర్చి ఓట్లు అడగటానికి ముందుకు వస్తున్నానని, అది నా ధైర్యమని జగన్ అన్నారు. మంచి చేశాడని అనిపిస్తే తనకు తోడుగా ఉండమని జగన్ కోరారు. తనకు భయం లేదని, తాను సవాల్ విసురుతున్నానని, చంద్రబాబు, దత్తపుత్రుడు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే ధైర్యముందా అని జగన్ సవాల్ విసిరారు.

రైతన్న కుటుంబాలను...
రైతు భరోసాతో రైతన్నల కుటుంబాలను ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఈ నాలుగేళ్లలో ఒక్కొక్క రైతు కుటుంబానికి 84 వేల సాయం అందించామని తెలిపారు. వరసగా నాలుగో ఏడాది రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. రైతు భరోసా కింద ఈ నాలుగేళ్లలో రైతులకు 27 వేల కోట్ల రూపాయలను అందించామని తెలిపారు. రైతన్నల మీద మమకారంతోనే తాను ఈ నిధులను విడుదల చేస్తున్నానని తెలిపారు. వ్యవసాయం అంటే ప్రేమ అంటే ఇలా ఉంటుందని ఆయన తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
పంట నష్టపరిహారాన్ని...
పంట నష్ట పరిహారాన్ని కూడా రైతన్నలకు అందిస్తున్నామన్నారు. ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ లోనే పంట నష్ట పరిహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. డిసెంబరులో వరదల వల్ల నష్టపోయిన రైతులకు 77 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు. ఆహార భద్రతతో పాటు 62 శాతం ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం అంటే అందరికీ కృతజ్ఞత ఉంటుందని జగన్ అన్నారు. రైతు భరోసాతో రాష్ట్రంలో యాభై లక్షల మంది కుటుంబాలకు సాయం అందిస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేళ్లలో వర్షాలు సమృద్ధిగా పడ్డాయన్నారు.
కరువు ఊసే లేకుండా...
ఈ నాలుగేళ్లలో కరువు ఊసేలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఏడాది కరువు వచ్చేదని, మూడు వందల మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాల్సి వచ్చేదన్నారు. కానీ ఈ నాలుగేళ్లలో ఒక్క కరువు మండలాన్ని కూడా ప్రభుత్వం డిక్లేర్ చేయలేదన్నారు. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని పరోక్షంగా విమర్శలు చేశారు. ఈయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువు ఖచ్చితంగా వస్తుందన్నారు. ఇది తాను చెప్పడం లేదని, లెక్కలు చెబుతున్నాయని, నగ్నసత్యమని జగన్ అన్నారు. ఈ నాలుగేళ్ల నుంచి ప్రతి రిజర్వాయర్, ప్రతి ఒక్క చెరువు నిండిందన్నారు. భూగర్భ జలాలు కూడా పెరిగాయన్నారు. ఆహార ధాన్యాల దిగుబడి కూడా గణనీయంగా పెరిగిందన్నారు. ధాన్యం సేకరణ కూడా రికార్డు స్థాయిలో జరిగిందన్నారు.


Tags:    

Similar News