జగన్ కు కేసీఆర్ పెద్ద ఫిట్టింగ్..?
కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జగన్ కూడా ఉద్యోగాల భర్తీకి పూనుకోవాల్సి ఉంటుంది.;
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒకదానితో ఒకదానిని పోల్చుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఏపీ ప్రభుత్వం కొన్నింటినైనా అమలు చేయాల్సిందే. అలాగే ఏపీ ప్రభుత్వం పెట్టిన పథకాలను తెలంగాణ సర్కార్ కూడా అమలు చేయాల్సిందే. ఎందుకంటే ప్రజలు రెండు రాష్ట్రాల పాలనను పోల్చి చూసుకుని మార్క్ లు వేస్తారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు - నేడు పథకాన్ని కేసీఆర్ సర్కార్ తన రాష్ట్రంలో ప్రవేశపెట్టింది. దీనిపై ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో కేసీఆర్ సయితం భేషజాలకు పోకుండా అమలు చేశారు.
కొలువుల జాతర....
అలాగే కరోనా సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్య శ్రీలో చేరిస్తే, తెలంగాణ ముఖ్యమంత్రిపై అక్కడి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ డిమాండ్ ను కేసీఆర్ ఎదుర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 91,147 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. గత ఎనిమిదేళ్లుగా అన్ని వర్గాలను ఏదో ఒక పథకం ద్వారా ఆకట్టుకుంటున్న కేసీఆర్ నియామకాల విషయంలో కొంత వెనకబడి ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటం, నిరుద్యోగుల్లో అసహనం పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో, గెలుపే లక్ష్యంగా కేసీఆర్ భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కొలువుల జాతరకు తెరలేపారు. నేటి నుంచే నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.
ఏపీలో అసహనం..
ఇదే సమయంలో ఏపీలోనూ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు అసహనంతో ఉన్నారు. పరిశ్రమలు పెద్దగా రాకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాకపోవడం వంటివి వచ్చే ఎన్నికలలో జగన్ సర్కార్ కు ఇబ్బందిగా మారనుంది. వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ పోస్టులను పెద్ద సంఖ్యలో భర్తీ చేసినా జాబ్ క్యాలెండర్ విడుదలపై నిరుద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. నిరుద్యోగ యువత కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు.
జగన్ కూడా....
ఇప్పుడు జగన్ కూడా ఉద్యోగాల భర్తీకి పూనుకోవాల్సి ఉంటుంది. పొరుగు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర జరుగుతుంటే, ఏపీలో మాత్రం నిరుద్యోగుల యాతన కనపడుతుందని అప్పుడే విపక్షాలు విమర్శలను ప్రారంభంచాయి. పొరుగు రాష్ట్రంతో పోల్చుకుంటే ఏపీలో ఉద్యోగాల భర్తీ పెద్దగా జరగలేదనే చెప్పాలి. ఇప్పుడు జగన్ కూడా ఉద్యోగాల నియామకాలకు వరస నోటిఫికేషన్లు ఇస్తే తప్ప వారిలో ఉన్న అసంతృప్తి చల్లారదు.