ఎన్నికలు - పెళ్లిళ్లు !

ఎన్నికల సీజన్ వచ్చిందంటే సాధారణంగా వివిధ రాజకీయ పార్టీలు తమ విధానాలను ప్రకటించడం

Update: 2023-08-13 12:47 GMT

ఎన్నికల సీజన్ వచ్చిందంటే సాధారణంగా వివిధ రాజకీయ పార్టీలు తమ విధానాలను ప్రకటించడం,వాగ్దానాలు చేయడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి.ఆంధ్రప్రదేశ్ లో ఇందుకు భిన్నమైన వాతావరణం కొనసాగుతోంది.ఫలానా వ్యక్తి ఎవరికీ జన్మించారు? ఆధారాలు ఏమిటి? డీఎన్ ఏ చేయిస్తారా? నుంచి మొదలుకొని పెళ్లిళ్లు,విడాకులు,ప్రేమలు,వివాహేతర సంబంధాలు... వంటి అవాంఛనీయ అంశాలు తెరపైకి తీసుకువస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్‌ పెళ్లిళ్లపై విమర్శిస్తున్నారు.ఈ వైఖరి ప్రజలు హర్షించదగినది కాదు.జగన్ గుట్టు తనకు తెలుసునని,చెబితే చెవుల్లోంచి రక్తం వస్తుందంటూ పవన్ అంతకు ముందు వ్యాఖ్యలు చేశారు.ఆ గుట్టు ఏమిటో పవన్ ఎప్పటికీ చెప్పరు.ఆయన చెప్పకపోతే మనకు తెలియదు.పవన్ కళ్యాణ్‌ ఏరికోరి వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా అవతరించడానికి చేస్తున్న ప్రయత్నం వల్ల ఆయన వ్యక్తిగత జీవితం మీద వైసీపీ గురిపెట్టింది.ఒక వ్యక్తి పెళ్లిళ్లు,విడాకుల గురించి మాట్లావచ్చునా లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.' వ్యక్తుల ప్రయివేటు జీవితం వారి వారి సొంతం.పబ్లిక్కులోకి వస్తే ఏమైనా అంటాం' అని శ్రీశ్రీ అన్నాడు.నిజమే మరి,ఒక వ్యక్తి రాజకీయ నాయకునిగా మారి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాను అని అంటున్నప్పుడు సహజంగానే ఆయన వ్యక్తిగత జీవితమంతా బహిరంగం కావలసిందే! సదరు నాయకుడికి పరిపాలనా పగ్గాలు అప్పజెప్పే ముందు ఎన్నో అంశాలు ప్రజల్ని ప్రభావితం చేస్తాయి.

పవన్ కళ్యాణ్ మూడుపెళ్లిళ్లు చేసుకున్నారు.ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారు.ప్రస్తుతం మూడో భార్యతో జీవనం సాగిస్తున్నారు.పవన్ కళ్యాణ్‌ అనేక సందర్భాల్లో ప్రత్యర్థులు తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడానికి ఆయనే ఆస్కారం ఇచ్చినట్లయింది.ప్రధాన స్రవంతి మీడియాలో కొంత నయం.కానీ సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు,నిందలు హద్దు మీరుతున్నవి.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల చుట్టూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా కాలంగా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. విద్యార్థులు,వారి తల్లిదండ్రులతో నిర్వహించిన 'అమ్మఒడి' సభలో కూడా సీఎం జగన్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు.తన పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్‌ ఎదురుదాడి చేస్తున్నారు.రాజకీయ లక్ష్యాలతోనే ఈ విమర్శలు,ప్రతి విమర్శలు వస్తున్నాయి.రాజకీయ నాయకులు కూడా విడాకులు తీసుకుని కొత్త జీవితాలు ప్రారంభించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నవి.

కాగా పవన్ కళ్యాణ్‌ మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారంటూ ఒక వర్గం మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ నేపథ్యంలో భార్యతో కలిసి పవన్ కళ్యాణ్ ఓ యాగం నిర్వహించారంటూ కౌంటర్ గా మరో ఫోటో విడుదలయ్యింది.అయితే అది మార్ఫింగ్ చేసిన ఫోటో అని వైసీపీ సోషల్ మీడియా విమర్శించింది.పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేస్తున్న విమర్శలపై చట్టపరంగా చర్యలు తీసుకోవలసిన చర్యలపై జనసేన పార్టీ నాయకులు చర్చిస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌ పదేళ్లుగా జగన్ మీద ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు.జగన్ ను గద్దె దించడమే తన లక్ష్యమని ఆయన ఇప్పటికి వందల సార్లు ప్రకటించి ఉండవచ్చు.పవన్‌ పేరు ప్రస్తావించకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటూ జగన్ విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.2019 ఎన్నికలకు ముందు కూడా కారు టైర్లు మార్చినట్టుగా పవన్ కళ్యాణ్ భార్యలను మార్చేస్తారని జగన్ వ్యాఖ్యానించారు.తాను ముఖ్యమంత్రి అవుతానని స్పష్టం చేయలేకపోవడం పవన్ నిస్సహాయత.బలహీనత.

తాను ప్రత్యేక పరిస్థితుల్లో చట్ట ప్రకారం నడుచుకున్నానే తప్ప,ఎవరినీ మోసం చేయలేదని పవన్ వివరణ ఇవ్వవలసి వస్తోంది. ‘‘కావాలంటే మీరు కూడా చేసుకోండి’’ అని కూడా పవర్ స్టార్ వ్యాఖ్యానించారు.పవన్ పెళ్లిళ్ల చుట్టూ రాజకీయ దుమారం వ్యూహాత్మకమె! వ్యక్తిగత అంశాలపైన రచ్చ ఎక్కువ జరిగితే అసలు సమస్యలను మరుగు పరచవచ్చునని జగన్ ప్రణాళిక.అయితే ఈ చర్చల్లో తెలుగుదేశం పార్టీని వైసీపీ,జనసేన వెనక్కి నెట్టిపారేశాయి.నైతికంగా పవన్ కళ్యాణ్‌ను కట్టడి చేయడానికి సీఎం ఇలాంటి ప్రయత్నానికి దిగుతున్నారు.

ఏపీలో రాజకీయ నాయకులు విజయవంతంగా హుందాతనం వదిలేశారు.కొంతకాలంగా బహిరంగసభల్లో వాడుతున్న భాష,మీడియా ముందు బూతులు ఆందోళనకరంగా ఉన్నవి.అన్ని పార్టీల నాయకులు ఇలాంటి ధోరణి మానుకోవలసి ఉన్నది.ముఖ్యమంత్రి కూడా ఆచితూచి మాట్లాడి ఆ పదవికి గౌరవం తీసుకు రావలసి ఉన్నది.వ్యక్తిత్వ హననం తమ పార్టీ సిద్ధాంతం కాదని, ఏనాడూ అలా వ్యక్తిగత విమర్శలకు దిగమని ఆ అలవాటు తెలుగుదేశం, జనసేన పార్టీలకే ఉందని అని ఏపీ ప్రభుత్వ సలహాదారు 'సకల శాఖల మంత్రి'గా గుర్తింపు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సందర్భంలో అన్నారు.కానీ ఆయన మాటలకు,వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శల దాడులకు ఎక్కడా పొంతన కుదరడం లేదు.

(Views, thoughts, and opinions expressed in this న్యూస్ story/article belong solely to the author)

Tags:    

Similar News