ఖమ్మం కట్టప్పలు వారిద్దరేనట.. కేసీఆర్ ఏం చేస్తారో?
టీఆర్ఎస్ కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి భగ్గుమంటుంది;
టీఆర్ఎస్ కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి భగ్గుమంటుంది. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే దీనిని రుజువు చేస్తున్నాయి. వర్గ పోరు పార్టీ పరువును బజారుకీడ్చింది. పార్టీ రాష్ట్ర నాయకత్వం పట్టించుకోక పోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. మున్ముందు ఈ అసంతృప్తి మరింత పెరిగే అవకాశముంది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు టీఆర్ఎస్ ఓట్లు క్రాస్ అవ్వడం పార్టీలో చర్చనీయాంశమైంది.
బలంగా లేకపోయినా..
ఖమ్మం జిల్లాలో తొలి నుంచి టీఆర్ఎస్ బలంగా లేదు. 2014 ఎన్నికల్లో అక్కడ వైసీపీ, టీడీపీ సత్తాను చాటాయి. అయితే ఆ తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇతర పార్టీల నేతలకు గులాబీ కండువా కప్పి పార్టీని బలోపేతం చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అలాగే 2018 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పరవాలేదనిపించింది. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ గెలిచినా మల్లు భట్టు విక్రమార్కను మినహాయించి అందరినీ కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారు.
అదే శాపంగా మారి...
అదే ఇప్పుడు పార్టీకి శాపంగా మారింది. ఈరోజు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది స్పష్టంగా కన్పించింది. టీఆర్ఎస్ స్థానిక సంస్థల నేతలు కాంగ్రెస్ కు క్రాస్ ఓట్ చేశారు. మొత్తం 738 ఓట్లు ఉండగా టీఆర్ఎస్ కు 480, కాంగ్రెస్ కు 242 ఓట్లు వచ్చాయి. నిజానికి కాంగ్రెస్ కు అక్కడ ఉన్న ఓట్లు 96 మాత్రమే. కానీ కాంగ్రెస్ అభ్యర్థికి 242 ఓట్లు వచ్చాయి. దాదాపు 150 ఓట్లు క్రాస్ అయ్యాయి. అయితే కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాల నుంచే క్రాస్ అయినట్లు అనుమానిస్తున్నారు.
వారిద్దరేనట....
ఇక్కడ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు గత కొంత కాలంగా అసంతృప్తిలో ఉన్నారు. వీరిద్దరి వర్గానికి చెందిన నేతలే క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి గత ఐదేళ్ల నుంచి ఏ పదవి దక్కలేదు. ఆయన వర్గానికి కూడా ప్రాధాన్యత దొరకడం లేదు. దీంతో ఆయన అనేక సార్లు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అందుకే అసంతృప్తి....
ఇక కొత్తగూడెంలో 2018లో ఓడిపోయినా పార్టీ కోసం జలగం వెంకట్రావు పనిచేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావును పార్టీలో చేర్చుకోవడంతో అసంతృప్తి తలెత్తి ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. చివరకు 238 ఓట్ల ఆధిక్యతతో ఎమ్మెల్సీగా గెలిచిన తాతా మధు క్రాస్ ఓటింగ్ పై అధినాయకత్వానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కానీ ఇంత భారీగా క్రాస్ ఓటింగ్ జరగడం టీఆర్ఎస్ కు దెబ్బ. దీనిపై పోస్ట్ మార్టం చేసి చర్యలు తీసుకోకపోతే భవిష‌్యత్ లో ఖమ్మం జిల్లాలో పార్టీ మరింత బలహీనపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యూహం ఇక్కడ ఫలించిందనే చెప్పాలి.