బాబు నిర్ణయం సరైనదేనా?

ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కూడా గతంలో తమిళనాడులో జయలలిత తీసుకున్నదే

Update: 2021-11-19 07:52 GMT

తమిళనాడు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకూ ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కూడా గతంలో తమిళనాడులో జయలలిత తీసుకున్నదే. నాడు జయలలితను శాసనసభలో అవమానించారని, ఆమె శపథం చేసి వెళ్లిపోయారు. తిరిగి ముఖ్యమంత్రిగానే జయలలిత సభలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు అదే తరహాలో చంద్రబాబు శపథం చేసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఎన్నడూ ఇలాంటి....
చంద్రబాబుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. 2014 నుంచే ప్రారంభమయింది. ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీ అప్పటి ప్రతిపక్ష పార్టీగా శాసనసభను బహిష్కరించింది. తమ పార్టీ శాసనసభ్యులను అన్యాయంగా చేర్చుకుంటున్నారని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అప్పట్లో జగన్ శాసనసభను బహిష్కరించారు. జగన్ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సభలోకి అడుగు పెట్టారు.
రెండున్నరేళ్ల సమయం ఉన్నా....
ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కూడా దాదాపు అలాంటిదే. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. సభలో చంద్రబాబుకు విలువ ఉండటం లేదు. కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఆయన పార్టీ ఓటములపై వెక్కిరింతలు ఎక్కువయ్యాయి. ఇక మాట్లాడేందుకు కొద్ది పాటి అవకాశం లభించినా పదే పదే సభ్యులు అడ్డుతగులుతున్నారు. కొందరైతే వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నారు.
ప్రతిపక్ష నేతగా....
దీంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. సభలోకి ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పి వెళ్లిపోయారు. సభలో ఉండి ప్రజాసమస్యలు ప్రస్తావిస్తే వచ్చే మైలేజీ కన్నా, ఈ నిర్ణయంతో ఆయనకు సింపతీ రావడం ఖాయంగా కన్పిస్తుంది. వైసీపీ నేతలు చేసింది తప్పే. దానిని ఎవరూ కాదనరు. కానీ ప్రతిపక్షనేతగా ఆయన ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండాల్సిందని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు తరహా రాజకీయాలు ఏపీలో నడుస్తున్నాయి.


Tags:    

Similar News