సీఎంగానే సభలో అడుగుపెడతారా?

చంద్రబాబు రాజకీయంగా చాలా కష్టాల్లో ఉన్నారన్నది మాత్రం వాస్తవం. జగన్ ను వచ్చే ఎన్నికల్లో ఎదుర్కొనడం అంత సులువు కాదు

Update: 2022-04-03 06:54 GMT

చంద్రబాబు నాయుడు రాజకీయంగా చాలా కష్టాల్లో ఉన్నారన్నది మాత్రం వాస్తవం. జగన్ ను వచ్చే ఎన్నికల్లో ఎదుర్కొనడం అంత సులువు కాదు. జగన్ అన్ని రకాలుగా బలంగా ఉన్నాడు. క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనపడుతుందన్నది చంద్రబాబుకు తెలియంది కాదు. చంద్రబాబుకు వయసు మీదపడటం, లోకేష్ ఖచ్చితంగా పార్టీ పగ్గాలు చేపడతారని భావించడంతో క్యాడర్ పెద్దగా పార్టీ పట్ల ఆసక్తి చూపడం లేదు. అందుకే చంద్రబాబు ఈ ఎన్నికలు తన ఆధ్వర్యంలోనే జరుగుతాయని పదే పదే చెబుతున్నారు.

సీఎం అయిన తర్వాతనే....
అంతేకాదు అసెంబ్లీ నుంచి బయటకు వస్తూ మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే శాసనసభకు వస్తానని శపథం చేయడం వెనక కూడా అదే కారణమంటున్నారు. లోకేష్ ను ముఖ్యమంత్రి ముఖచిత్రం నుంచి తప్పించడంలో చంద్రబాబు చాలా వరకూ సక్సెస్ అయ్యారు. కానీ లోకేష్ ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ నాయకుడిగా ఎదగలేరన్న ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడిగా ఎదిగేందుకు వీలవుతుంది.
ఇమేజ్ గతంలోలా....
చంద్రబాబు ఇమేజ్ కూడా గతంలోలా లేదు. ఆయన హామీలను జనం విశ్వసించే పరిస్థితి లేదు. అందుకే ఆయన పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో లోకేష్ కు అండగా ఉండేందుకు యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీని వీడిపోయిన బీసీలను దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దళిత ఓటు బ్యాంకును దరిచేర్చుకోవడానికి కూడా చంద్రబాబు శ్రమిస్తున్నారు. అయినా పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవడంలో విఫలమయింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి చంద్రబాబు డిసైడ్ అయ్యారు.



 


కుటుంబ సభ్యులు....
ఇక గత ఎన్నికలలో చంద్రబాబుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవరూ మద్దతు తెలపలేదు. పరోక్షంగా మద్దతు ప్రకటించారు తప్పించి, నేరుగా ప్రచారంలో పాల్గొనలేదు. కానీ ఈసారి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా చంద్రబాబుకు మద్దతుగా నిలవనున్నారు. లాస్ట్ ఛాన్స్ అంటారో? అభివృద్ధి పథం అని చెబుతారో తెలియదు కాని నందమూరి కుటుంబం యావత్తూ ఈసారి ప్రచారంలోకి దిగనుంది. చంద్రబాబును ఈసారి గెలిపించుకోవడానికి మొన్నటి వరకూ ఆయనను వ్యతిరేకించిన వారు కూడా ఏకమవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోయినా ప్రకటన ద్వారా ఆయన మద్దతు పొందాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. మొత్తం మీద ఈసారి చంద్రబాబు ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ఆయన కుటుంబ సభ్యులతో పాటు గత ఎన్నికల్లో వ్యతిరేకించిన వారు కూడా ఒకటవుతున్నారు.


Tags:    

Similar News