రెడ్డిగారూ.. ఏం సాధించారు?
జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డికి ఎట్టకేలకు వైసీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది.;
జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డికి ఎట్టకేలకు వైసీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. అయితే రామసుబ్బారెడ్డికి ఈ పదవి కొత్తేమీ కాదు. టీడీపీ హయాంలోనూ ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. గత ఎన్నికల సందర్భంగా ఆయన పోటీ చేసేందుకు వీలుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆదినారాయణరెడ్డి సోదరుడు శివనాధరెడ్డికి కేటాయించారు. రామసుబ్బారెడ్డి కుటుంబం దశాబ్దాలుగా టీడీపీలోనే కొనసాగింది. ఫ్యాక్షన్ రాజకీయాలను తట్టుకుని నిలబడింది. జమ్మలమడుగులో పార్టీ జెండాను ఎగురవేయడంలో పొన్నపురెడ్డి కుటుంబం ముందుందన్న పేరుంది.
టీడీపీలోనే దశాబ్దాల పాటు...
1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి పొన్నపురెడ్డి కుటుంబం టీడీపీనే నమ్ముకుంది. అన్ని సార్లు జమ్మలమడుగు టిక్కెట్లు ఆ కుటుంబానికే టీడీపీ అధినాయకత్వం ఇచ్చింది. 1983 నుంచి వరసగా ఆ కుటుంబం జమ్మలమడుగులో గెలుస్తూ వచ్చింది. 1983 నుంచి 1999 వరకూ జరిగిన ఐదు ఎన్నికల్లో ఆ కుటుంబ సభ్యులే గెలిచారు. రామసుబ్బారెడ్డికి మంత్రి పదవిని కూడా టీడీపీ ఇచ్చి గౌరవించింది. 1999 తర్వాత ఆ కుటుంబానికి జమ్మలమడుగులో విజయం లభించలేదు. టిక్కెట్ టీడీపీ ఇస్తున్నా రామసుబ్బారెడ్డి మాత్రం గెలవలేకపోయారు.
టీడీపీ చేసిందీ అదే...
2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా రామసుబ్బారెడ్డి గెలవలేదు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అయితే రామసుబ్బారెడ్డి మీద గెలిచిన ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి చేర్చుకుని మంత్రి పదవి ఇవ్వడంతో రామసుబ్బారెడ్డి కుటుంబం ఆగ్రహానికి గురైంది. తమ ప్రత్యర్థిని ఎలా తీసుకుంటారంటూ మండిపడింది. అయినా చంద్రబాబు పొన్నపురెడ్డి కుటుంబంపై ఉన్న నమ్మకంతో ఎన్నిసార్లు ఓటమిపాలయినా 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు టిక్కెట్ ఇచ్చారు. ఆదినారాయణరెడ్డిని ఎంపీగా పోటీ చేయించారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2019 ఎన్నికల తర్వాత రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు.
ఎందుకు మారినట్లు?
వైసీపీలో చేరినా జమ్మలమడుగులో పార్టీలో ఇబ్బందులు పడుతున్నారు. రామసుబ్బారెడ్డికి, ప్రస్తుత ఎమ్మెల్యే మూలే సుధీర్ రెడ్డికి మధ్య సయోధ్య లేదు. దీంతో అధినాయకత్వం అనేక సార్లు పంచాయతీలు చేసింది. ఈసారి టిక్కెట్ కూడా సుధీర్ రెడ్డికేనని రామసుబ్బారెడ్డికి వైసీపీ స్పష్టం చేసింది. తాజాగా ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశమిచ్చింది. వైసీపీలో చేరి రామసుబ్బారెడ్డి ఏం సాధించారని ఆయన అనుచరులే ప్రశ్నిస్తున్నారు. ఇదేదో టీడీపీలో ఉన్నా హుందాగా ఉండేది కదా? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద రామసుబ్బారెడ్డి పార్టీ మారినా ప్రయోజనం లేదని, పెద్దల సభకే పరిమితం కావాల్సి వచ్చిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.