గుత్తాకు ఝలక్ ఇవ్వనున్న కేసీఆర్
సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కోరిక నెరవేరనట్లే కనపడుతుంది. ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలు లేవు;
సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కోరిక నెరవేరనట్లే కనపడుతుంది. ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలు కన్పించడం లేదు. ఆయనను తిరిగి శాసనమండలి ఛైర్మన్ గా కేసీఆర్ నియమించే అవకాశాలు కన్పిస్తున్నాయి. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువవడే అవకాశముంది. డిప్యూటీ ఛైర్మన్ గా బండ ప్రకాష్ ను ఎంపిక చేయవచ్చన్న ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇప్పటికే కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది.
మంత్రి పదవిని ఆశించి...
గుత్తా సుఖేందర్ రెడ్డి సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో ఉండి టీఆర్ఎస్ లో చేరారు. ఆయన టీఆర్ఎస్ లో చేరింది మంత్రివర్గంలో చేరడానికే. గుత్తాకు మంత్రి పదవి చేపట్టడం ఒక కల. అది కేసీఆర్ ద్వారానే నెరవేరుతుందని భావించిన ఆయన టీఆర్ఎస్ లో చేరారు. అయితే చేరిన తర్వాత ఎమ్మెల్సీని చేసిన కేసీఆర్ మండలి ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు. ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తి కావడంతో మరోసారి రెన్యువల్ చేశారు.
తిరిగి ఛైర్మన్....
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గుత్తా సుఖేందర్ రెడ్డిని తిరిగి శాసనమండలి ఛైర్మన్ గా ఎంపిక చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారట. స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కావడంతో త్వరలోనే ఈ ఎన్నిక జరుగుతుంది. శాసనమండలి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి గుత్తా సుఖేందర్ రెడ్డిని మండలి ఛైర్మన్ గా, డిప్యూటీ ఛైర్మన్ గా బండ ప్రకాష్ ను ఎంపిక చేసే అవకాశముంది.
కల నెరవేరేటట్లు లేదు....
బండ ప్రకాష్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా ఆయనను కేసీఆర్ ఎమ్మెల్సీని చేశారు. దీంతో ఆయనకు ఈటల స్థానంలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించారు. కానీ కేసీఆర్ మనసు మార్చుకుని ఆయనను మండలి డిప్యూటీ ఛైర్మన్ గా ఎంపిక చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. మొత్తం మీద గుత్తా సుఖేందర్ రెడ్డి ఆశలు ఈసారి కూడా నెరవేరేటట్లు కన్పించడం లేదు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉండటంతో యువకులను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.