పీకే ఎంట్రీతో బాబు రీఎంట్రీనా?
గుజరాత్ లో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కు ఎన్నికల వ్యూహకర్తగా పని మొదలుపెడితే ఏపీలో చంద్రబాబు పని సులువవుతుంది;
గుజరాత్ లో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కు ఎన్నికల వ్యూహకర్తగా పని మొదలుపెడితే ఏపీలో చంద్రబాబు పని సులువవుతుంది. చంద్రబాబు ఇప్పటికీ బీజేపీ తో పొత్తు కావాలని కోరుకుంటున్నారు. బీజేపీ మద్దతు ఉంటే ఆ లెక్క వేరుగా ఉంటుందని ఆయన అంచనా. ఆ పార్టీకి ఓట్లు పెద్దగా లేకపోయినా ఎన్నికల సమయంలో అన్ని రకాలుగా అండ లభించే అవకాశముంది. అందుకే ఆయన ఇప్పటికీ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు వదిలి పెట్టడం లేదు.
జగన్ కు దగ్గరగా....
అయితే ప్రశాంత్ కిషోర్ వైఎస్ జగన్ కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. వచ్చే ఎన్నికల్లోనూ పీకే ఎన్నికల వ్యూహకర్తగా ఉండబోతున్నారని జగన్ ప్రకటించారు కూడా. పీకే టీం త్వరలోనే ఏపీలో వైసీపీ కోసం పని మొదలు పెట్టనుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాస్త అటూ ఇటూ అయితే ప్రశాంత్ కిషోర్ కీలకంగా మారతారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఆయన కూడగట్టే అవకాశముంది. ఆ శక్తి సామర్థ్యాలు కూడా ఆయనకు ఉన్నాయి.
కేసీఆర్ విషయంలోనూ....
ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతోనే ముందుకు వెళుతున్నారు. బీజేపీ మీద కేసీఆర్ ఒంటికాలి మీద లేవడానికి ప్రశాంత్ కిషోర్ కారణమని బీజేపీ నమ్ముతుంది. అందుకే జగన్ విషయంలోనూ బీజేపీ అగ్రనాయకత్వానికి కొంత అనుమానాలు కలగక మానదు. అలాగని జగన్ తనపై అక్రమ కేసులు పెట్టిన కాంగ్రెస్ కు గుడ్డిగా మద్దతివ్వరని తెలిసినా, పీకే వ్యూహాలు ఎలా ఉంటాయో తెలియవు కనుక బీజేపీ చంద్రబాబుకు మద్దతు పలికే అవకాశాలున్నాయి.
గుజరాత్ ఎన్నికలే.....
గుజరాత్ ఎన్నికలు ఈ ఏడాది చివరలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పీకే వ్యూహం సక్సెస్ అయి కాంగ్రెస్ గెలిస్తే ఏపీలోనూ బీజేపీ తన ఆలోచనను మార్చుకుంటుంది. బీజేపీ గెలిస్తే పీకేను పెద్దగా పట్టించుకోకపోవచ్చు. జగన్ కంటే చంద్రబాబు బెటర్ అని భావిస్తుంది. అందుకే చంద్రబాబు ఇప్పటికీ కాంగ్రెస్ అనుకూల పార్టీలతో దూరంగా ఉంటున్నారు. పీకే వ్యవహారం చంద్రబాబుకు అనుకూలంగా మారే అవకాశాలున్నాయన్నది వాస్తవం. మరి గుజరాత్ ఎన్నికల ఫలితాలు బీజేపీ, చంద్రబాబు పొత్తును తేలుస్తాయంటున్నారు.