భారత్ విండీస్ మ్యాచ్ టీ ట్వంటీ సిరీస్ ను క్లిన్ స్వీప్ చేసింది టీం ఇండియా. ఇప్పటికే 2-0 తో దూకుడు మీద వున్న ఇండియా అదే జోరును చివరి మ్యాచ్ లో కొనసాగించి ఆరువికెట్ల తేడాతో వెస్ట్ ఇండీస్ పై ఘనవిజయాన్ని అందుకుని ట్రోఫీ ముద్దాడింది. అయితే మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగడం మూడో టి ట్వంటీ ప్రత్యేకత. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 182 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. అక్కడితోనే క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ఆరంభంలోనే ...
మంచి జోరుమీద వున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఆరంభంలోనే 4 పరుగులు చేసి నిరాశ పరిచాడు. రోహిత్ బాటలోనే కె ఎల్ రాహుల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో లేకుండా పెవిలియన్ చేరాడు. దాంతో శిఖర్ ధావన్ కి రిషబ్ పంత్ తోడుగా నిలిచాడు. అప్పటికే భారత్ రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. పంత్ అండతో ధావన్ చెలరేగి ఆడాడు. ఇద్దరు మూడో వికెట్ కి 130 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం.
ఏడు పరుగుల లక్ష్యంతో.....
మరో 7 పరుగులతో విజయానికి టీం ఇండియా చేరువ అవుతుందనుకున్న సమయం లో పంత్ ను పాల్ అవుట్ చేసి విండీస్ ను తిరిగి పోటీలో నిలిపాడు. చివరి ఓవర్ ఐదో బంతికి ధావన్ కూడా వెనుతిరగడంతో అందరిలో టెన్షన్ మొదలైంది. ఆఖరి బంతికి ఒక్క పరుగు చేయాలిసిన తరుణంలో మనీష్ పాండే సింగిల్ కొట్టి మ్యాచ్ ను గెలుపు తీరానికి చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ధావన్ 62 బంతుల్లో 92 పరుగులు చేయగా, పంత్ 38 బంతుల్లో 58 పరుగులు సాధించారు.